18 August, 2026 | 3:01 AM

కులగణనపై సందేహాలు

18-08-2026 12:00 AM

జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ దేశవ్యాప్తంగా మరోసారి జనగణనలో కులగణన అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా కేంద్రం నోటిఫై చేసిన ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీల వలె వెనుకబడిన వర్గాల గుర్తింపునకు ప్రత్యేక కాలమ్‌ను కేటాయించకపోవడంపై బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిపై బీసీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

కాగా, దేశ జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీల కచ్చితమైన జనాభా గణాంకాలు అందుబాటులో లేకపోవడం వల్ల వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర విధానాలు రూపొందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే వాదన చాలాకాలంగా ఉన్నది. తెలంగాణ లో ఈ డిమాండ్ మరింత బలంగా ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో హక్కులు, అవకాశాలు, ప్రాతినిధ్యం కోసం బీసీలు తీవ్రంగా ఉద్యమిస్తున్నారు.

ఈ తరుణంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్టుగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ పార్టీ జాతీయ స్థాయకత్వం కూడా మద్దతు తెలపడం బీసీ ఉద్యమానికి బలాన్నిచ్చింది. జాతీయస్థాయిలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకోవడంతో మొదటినుంచి కులగణనను వ్యతిరేకిస్తూ వస్తున్న బీజేపీ తలొంచక తప్పలేదు.

అయితే, మొన్నటివరకు కులగణన చేపడతామని చెబుతూ వచ్చిన కేంద్రం నేడు బీసీల గణనపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. బీసీల గుర్తింపునకు ప్రత్యేక కాలమ్ కేటాయించకుండా, బీసీల జనాభాను ఏ విధంగా నమోదు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాగా, కులగణన అంటే కేవలం అంకెలు కాదు. ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారు? వారి విద్య, ఆర్థిక స్థితిగతులు ఏమిటి? అనే సమగ్ర సమాచారాన్ని శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేయాల్సి ఉంటుంది.

బీసీలకు న్యాయమైన వాటా కల్పించాలంటే ముందుగా వారి వాస్తవ జనాభా, సామాజిక స్థితిగతులపై స్పష్టమైన గణాంకాలను బయటికి తీయాలి. అలా కాకుండా ఇతర కులాల సరసన చేర్చడమంటే బీసీలను విస్మరించడమే. దీనివల్ల భవిష్యత్తులో బీసీ జనాభా, ఉప కులాల పరిస్థితి, వారి వెనుకబాటుతనాన్ని అంచనా వేయడంలో సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి సందేహాలకు తావులేకుండా బీసీ జనాభాను సమగ్రంగా నమోదు చేయాలి.