1 March, 2026 | 2:57 AM

పెళ్లిళ్లలో వరకట్నం నిషేధం

01-03-2026 01:02 AM

వధూవరులకు ఇంటింటి నుంచే కానుకలు

కొత్త ఆచారానికి తెర లేపిన అడవి బిడ్డలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 వివాహాలు

ఆదిలాబాద్/ఉట్నూర్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): అడవినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల ఆచార వ్యవహారాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. నియమనిష్టలతో నిర్వహించే వారి సంస్కృతి సాంప్రదాయ పూజలకు తోడుగా మరో కొత్త ఆచారానికి ఆదివాసీలు తెర లేపారు. ఇక నుంచి అడవి బిడ్డల పెళ్లిళ్లలో వరకట్నం అనే పదం వినబడకుండా వరకట్న నిషేధానికై తీర్మానాలు చేశారు. వరకట్నాలు లేకుండా పెళ్లి జరిపించాలనే గొప్ప ఆలోచనతో ఆదివాసి గిరిజనలు ముందుకు వస్తున్నారు.

ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 70 పెళ్లిళ్లు కట్నాలు లేకుండా చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారునికి ఇంటింటి నుంచి పోగు చేసిన నగదును అందజేస్తువస్తున్నారు. ఇటీవల జరిగిన పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ వరకట్న నిషేధంపై ఆదివాసీలు అనుసరిస్తున్న విధానం తెలుసుకుని వారిని అభినందించారు. 124 రాయి సెంటర్‌ల పరిధిలోని దాదాపు 2016 ఆదివాసి గూడాలలో వరకట్న నిషేధంపై తీర్మానాలు చేస్తున్నారు. పెళ్లి సమయంలో  ఆడపిల్ల తల్లిదండ్రులు కూతురు వివాహం కోసం అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతున్నందున గిరిజన గూడల పెద్దలు, పటేళ్లు వరకట్న నిషేధం, కానుకలు చెల్లించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గ్రామ పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేకంగా సమావేశమై పెండ్లి కూతురుకు, కుమారుడికి ఇంటింటి నుండి కొంతమేర డబ్బులు పోగుచేసి, కానుకలుగా అందజేస్తున్నారు. ఆడ కూతురు పెళ్లికి రూ.300, యువకుడి పెళ్లికి రూ.200 చొప్పున జమచేసి అందజేస్తున్నారు. ప్రతి ఇంటికి కానుక రూపంలో జమ చేస్తున్న నగదు పెండ్లి ఖర్చులకు సరిపోతున్నాయని వివిధ గ్రామాల పటేళ్లు చెపుతున్నారు. గ్రామస్తులకు, బంధువులకు భోజనం ఖర్చులను వధూవరుల కుటుంబాలు భరించుకోవడంతో ఆదివాసి గిరిజన పెళ్లిలు కుటుంబాలకు భారం కాకుండా ఆనందంగా జరుగుతున్నాయి.

ఆర్థికంగా నష్టపోవద్దనే ఈ నిర్ణయం

ఆదివాసి గిరిజనుల పెళ్లి సమయంలో ఆర్థికంగా నష్టపోకూడదని ప్రతి గూడెంలో వరకట్న నిషేధాన్ని అమలు చేస్తున్నాం. వధువు పెళ్లికి ప్రతి ఇంటి నుంచి కొంత నగదు జమ చేసి అందజేస్తున్నం. వరుడికి సైతం ప్రతి ఇంటి నుండి కానుకలో రూపంలో సామగ్రికి బదులు నగదు అందజేస్తున్నం. దీంతో రెండు కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. 

తొడసం అమృత్ రావ్, జిల్లా మేడి (జిల్లా రాయి సెంటర్ల అధ్యక్షుడు)