28 May, 2026 | 1:53 AM

చర్చల సాగదీత!

28-05-2026 12:00 AM

పశ్చిమాసియా సంక్షోభం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నది. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావనలు కొనసాగిస్తూనే ఇరాన్‌పై అమెరికా, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపుపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఆందోళనకరం. ఇజ్రాయెల్ గాజా మధ్య తొలుత ప్రారంభమైన ఈ పోరు.. ఆ తర్వాత ఒకవైపు ఇరాన్, మరోవైపు అమెరికా జోక్యం, హోర్ముజ్ జలసంధి మూసివేతతో యావత్ ప్రపంచానికి సవాల్‌గా మారిన విషయం విదితమే. ఒక ప్రాంతీయ ఘర్షణ స్థాయి నుంచి క్రమంగా ప్రపంచ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే సంక్షోభంగా మారిన ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐరాసతోపాటు ఖతార్, టర్కీ లాంటి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండటానికి పరస్పర విశ్వాసం లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇరాన్ తన భద్రత కోసం అణు కార్యక్రమాలు అవసరమని వాదిస్తుండగా; అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మాత్రం వాటిని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తున్నాయి. ఇప్పటికే అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి లాంటి పీటమూడులతో శాంతిచర్చలు ముందుకుసాగకపోగా, ఇప్పుడు వాటికి ‘అబ్రహం అకార్డ్స్’ కూడా జతకలిసింది.

2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందం మూలం గా యూఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో లాంటి దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పశ్చి మాసియా యుద్ధం నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని విస్తరించి ఇజ్రాయెల్‌కు శాశ్వత భద్రత కల్పించాలని అమెరికా యోచిస్తున్నది. ముఖ్యంగా --ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సత్సంబంధాలు ఏర్పడితే ప్రాంతీయ సమీకరణాలు మారవచ్చని అగ్రరాజ్యం భావిస్తున్నది.

అయితే, శాంతి చర్చలకు మధ్యవర్తి త్వం వహిస్తున్న పాకిస్థాన్ దేశమే ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించకపోవడం సమస్యగా మారింది. అదే సమయంలో గాజాలో జరిగిన మారణహోమం తర్వాత అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరిగినట్టు తెలుస్తున్నది. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకుండా ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు అరబ్ దేశాలు నిరాకరిస్తున్నాయి. ఇది శాంతి చర్చ లకు విఘాతంగా మారుతున్నది. కాగా, నెలల తరబడి కొనసాగుతున్న ఈ పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కకావికలం చేస్తున్నది. అయితే, ఏ యుద్ధానికైనా దౌత్యమార్గం ద్వారానే అంతిమ పరిష్కారం లభిస్తుందని చరిత్ర చెప్తున్న సత్యాన్ని ఇరుపక్షాలు విస్మరించకూడదు.