1000 కోట్లు ఎక్కడ?
తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా జరిగిన సభలో “1000 కోట్లు - పోస్టులు” అంటూ భారీ హామీలు ఇచ్చి విద్యార్థుల్లో ఆశలు కలిగించారు. అనంతరం అసెంబ్లీలో వెయ్యి కోట్ల రూపాయల నిధులపై బిల్లు పాస్ చేసినప్పటికీ, ఇప్పటివరకు యూనివర్సిటీలో ఎలాంటి అభివద్ధి పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయం.
ముఖ్యమంత్రి సభలో ఆధునిక భవనాలు, డిజిటల్ క్యాంపస్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏఐ విజువల్స్, వీడియోలు చూపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలు, వీడియోలు విద్యార్థులను ఆకట్టుకునేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కానీ, ప్రస్తుతం యూనివర్సిటీలో వాస్తవ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాష్ర్టం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడిచినప్పటికీ ఉస్మానియా నివర్సిటీలో పూర్తిస్థాయిలో అధ్యాపక నియామకాలు చేపట్టకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీల పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. ఉన్నత విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు యూనివర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 1268 అధ్యాపక పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 312 మంది అధ్యాపకులతోనే వర్సిటీ నడుస్తోంది. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉండటంతో అనేక విభాగాలు తీవ్ర సిబ్బంది కొరతతో కొనసాగుతున్నాయి. అ ధ్యాపకుల కొరత కారణంగా తరగతులు సక్రమంగా నిర్వహిం చకపోవడం, విద్యార్థులకు సరైన అకడమిక్ గైడెన్స్ అందకపోవడంతో పరిశోధనలో ఇబ్బందు లు తలెత్తుతున్నాయి.
ప్రత్యేకంగా రీసెర్చ్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. సైన్స్ కాలేజీలోని కొన్ని విభాగాల్లో సరైన ల్యాబ్ పరికరాలు, ఆధునిక పరిశోధనకు అవసరమైన ఇక్విప్‌మెంట్ లేకపోవడంతో విద్యార్థులు తమ పరిశోధనలు పూర్తిచేసేందుకు ఇతర యూనివర్సిటీలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా గుర్తింపుపొందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కనీస మౌలిక వసతుల కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరడం దురదృష్టకరం.
ముఖ్యమంత్రి అధ్యాపకుల నియామకాల విషయంలో రాజకీయ జోక్యం ఉండదని, తమ పార్టీ నాయకులు ఎవరూ జోక్యం చేసుకోరని, మొత్తం నియామక ప్రక్రియను యూనివర్సిటీ యాజమాన్యానికి అప్పగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులు కూడా ఈ అంశంపై ఏ మాత్రం స్పందించడం లేదు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కార్యాచరణ, నోటిఫికేషన్ లేదా టైమ్‌లైన్‌పై స్పష్టత ఇవ్వకపోవడం విద్యార్థుల్లో తీవ్ర అనుమానాలు కలిగిస్తోంది.
ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా మారుస్తామని చెప్పే ప్రభుత్వం ముందు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీచేసి, రీసెర్చ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. నాణ్యమైన విద్య అందించాల్సిన యూనివర్సిటీలో విద్యార్థులు సరైన అధ్యాపకులు, ల్యాబ్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడటం దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం “1000 కోట్లు - 1000 పోస్టులు” హామీ అమలుపై కార్యాచరణను రూపొందించాలి. ఖాళీగా ఉన్న అధ్యాపక, బోధనేతర పోస్టులను అత్యవసరంగా భర్తీచేయాలి. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించాలి. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం తప్పదు.
వ్యాసకర్త: ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు, 9121991466






