రూ.1.16 కోట్లతో డ్రైనేజీ పనులకు శ్రీకారం
ఉప్పల్, ఆగస్టు 4 విజయక్రాంతి : మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలో లక్ష్మీనగర్, కృష్ణానగర్, తిరుమలనగర్ కాలనీలలో రూ.1.16 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
వర్షాకాలంలో కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ఈ పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మాజీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ, డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వరక్స్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






