09-01-2026 12:00:00 AM
నరసింహుల పేటలో పోలీసుల తనిఖీలు
మహబూబాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): గంజాయి సాగు చేస్తున్న ఘటన ఇటీవల మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూడడంతో గంజాయి సాగును గుర్తించేందుకు పోలీసులు డ్రోన్ తో జల్లెడ పడుతున్నారు. ఇటీవల నరసింహుల పేటలో వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గంజాయి అక్రమ సాగు అడ్డుకట్ట వేసేందుకు సీసీఎస్, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, మహబూబాబాద్ జిల్లా పరిధిలో గంజాయి అక్రమ సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించేందుకు విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా డ్రోన్ల సహాయంతో వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఒంటరి పొలాలు, దూర గ్రామ ప్రాంతాలపై రైతులకు ఇబ్బంది లేకుండా గగనతల పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. గంజాయి లాంటి మాదకద్రవ్యలపై ఉక్కుపాదం మోపుతూ జిల్లా మొత్తం జల్లెడ పట్టే విధంగా తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం, పాత గంజాయి నేరస్తులు, గంజాయి విక్రయించే వ్యక్తులు, అక్రమ రవాణా మార్గాలు, గంజాయి నిల్వ చేసే ప్రాంతాలు, విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి అక్రమ సాగు, రవాణా, నిల్వ, విక్రయం, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తూ, ఎవరైనా ఈ అక్రమాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీఎస్ బృందాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది సమన్వయంతో రాత్రి పగలు తేడా లేకుండా గంజాయి అక్రమాలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ రాజీ పడదని స్పష్టం చేశారు. గంజాయి సాగు, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే, భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ, ప్రజల సహకారంతోనే గంజాయి రహిత మహబూబాబాద్ జిల్లా సాధ్యమవుతుందని తెలిపారు.