డ్రగ్స్ ముఠా అరెస్టు
భారీగా డ్రగ్స్, నగదు పట్టివేత
ఎల్బీనగర్, జూన్ 18: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందా ఆగ డం లేదు. తాజాగా మరో ఆరుగురిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన అత్తాపురం భరత్ రెడ్డి (21), వనస్థలిపురానికి చెందిన చిక్యాల విక్యత్ (19) ఇద్దరు స్నేహితులు. వీరు డ్రగ్స్‌కు అలవాటు పడడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం తో డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించేవారు.
ఆదివారం వీరి ద్దరూ బెంగళూరు నుంచి 26 గ్రాముల డ్రగ్స్‌ను కొనుగోలు చేసి విక్యత్ ఇంట్లో దాచిపెట్టారు. సోమవారం హయత్‌నగర్‌కు చెందిన తన్నర్ హేమంత్ కుమార్(25)కు డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నించగా పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్, మొబై ల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అనాజీపుర్ ఎక్స్‌రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బోరబండకు చెందిన మెకానిక్ సామల దినేశ్ (28), కార్పెంటర్ అమర్త లూరి నిజాయతీ (29), ప్రైవేట్ ఉద్యోగి తాళ్లపల్లి భరణి (26) డ్రగ్స్ తీసు కోవడంతో పాటు విక్రయించేవారు.
ఈ ముగ్గురు హషీష్ ఆయిల్(గంజాయి నూనె) ను తరలిస్తుండగా సోమవారం రాత్రి ఎల్బీనగర్, భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అనాజీపురం ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 లీటర్ల హషీష్ ఆయిల్, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో నిందితులను రాచకొండ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ డీసీపీ మురళీధర్, మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు.
రూ.కోటి విలువైన ఆల్ప్రాజోలం డ్రగ్స్ పట్టివేత
పటాన్‌చెరు, జూన్ 18: నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ కేంద్రంపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ఆల్ప్రాజోలం డ్రగ్స్, ముడి పదార్థాలను పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ రూపేశ్ ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరులకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెంది న గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్ గౌడ్, అనంతారం గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్ అనే నలుగురు కొత్తపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని అందులో కోళ్ల ఫారం నడుపుతూ అక్కడే గుట్టుచప్పుడు కాకుండా ఆల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ చేస్తున్నారు.
ఆల్ప్రాజోలం డ్రగ్స్‌ను తయారు చేసి కల్లు దుకాణాల్లో అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, జిల్లా పోలీసులు దాడులు చేసి 2.6 కిలోల డ్రగ్స్‌ను, ౩౦ కిలోల ముడి పదార్థాలను సాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ సుమారు రూ.కోటి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అంజిరెడ్డి, సాయికుమార్‌గౌడ్, రాకేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.






