34 వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 34 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు బుధవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో మీడియాతో వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే 14 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ బోధనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు.
బీఈడీ, డీఈడీ వంటి అర్హతలు కలిగిన సుమారు16 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కృష్ణయ్య కోరారు. పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే విద్యాప్రమాణాలు మెరుగుపడి, విద్యార్థులు భవిష్యత్తులో నైపుణ్యవంతులుగా ఎదుగుతారని అన్నారు.






