9 June, 2026 | 2:31 AM

కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే అవినీతే!

09-06-2026 01:26 AM

రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు స్కామ్‌ను కాగ్ తేల్చింది 

కోల్ మైన్స్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది

  1. ఎన్డీఏ హయాంలో బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు 
  2. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గిస్తాం
  3. నూతన భారత నిర్మాణంలో కోల్ సెక్టార్ కీలకపాత్ర 
  4. అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం చేస్తున్నాం 
  5. తన శాఖలో 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్‌ని, బొగ్గు గనుల మంత్రి జైలుకు వెళ్లారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందని కాగ్ అప్పట్లో నివేదిక ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ హ యాంలో కేటాయించిన కోల్ మైన్స్‌ను కూడా సుప్రీంకోర్టు ఆ నాడు రద్దు చేసిందని గుర్తు చేశారు. కానీ ఎన్డీఏ హయాం లో బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని, నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలకపాత్ర పోషి స్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

బొగ్గు వెలికి తీసి, వదిలేసిన 147 మైన్స్‌ను సైంటిఫిక్ మెథడ్‌లో మైన్ క్లోజింగ్ యాక్టివిటీ చేస్తున్నామన్నారు. మైన్ క్లోజింగ్‌లో గిన్నిస్ రికార్డు సాధిచాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. 2028లో తాము అధికారంలోకి రాగానే సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తాన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను తగ్గించేం దుకు అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నాని చెప్పారు. తన శాఖలో ఈ 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలపై ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు.

బొగ్గు రంగంలో 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి, 25 లక్షల మందికి ప రోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఏడాదికి దాదాపు 90వేల కోట్లు బొగ్గు రవాణా ద్వారా అందుతోందని, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుపాత్ర కీలకమన్నారు. యూపీయే హయాంలో.. విద్యుత్ కొరతలతో ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు జరిగిన విషయం మనందరికీ తెలుసని, కానీ ఇవాళ దేశవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ హయాం మొత్తం కోల్ అంటే అవినీతి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేదని, అవినీతి కారణంగా.. బొగ్గుమంత్రే జైలుకెళ్లారని తెలిపారు. గత 12 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క అక్రమం, అవినీతి జరగకుండా.. ప్రధాని మోదీ నేతృత్వంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇవాళ ప్రపంచంలో రెండో అతిపెద్ద కోల్ ప్రొడ్యూసర్‌గా, రెండో అతిపెద్ద వినియోగదారుగా మనమే ఉన్నామ న్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద బొగ్గు నిల్వలు మన దగ్గర ఉన్నాయని, కోలిండియా కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉందన్నారు.

విద్యుదుత్పత్తిలో.. 72శాతం బొగ్గు ద్వారానే జరు గుతోందని, మొత్తం 426 గనుల్లో బొగ్గు ఉత్పత్తి అవుతోందని చెప్పారు. గతేడాది, ఈ ఏడాది బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించామని, ప్రధాని మోదీ ప్రతివారం దీనిపై రివ్యూ చేస్తారన్నారు. స్టీల్ ఉత్పత్తి, సిమెంట్, ఫర్టిలైజర్, స్పాంజ్ ఐరన్, కెమికల్స్ వంటి ప్రముఖ రంగాలకు బొగ్గు ప్రధానమైన రామెటీరియల్ అన్నారు.

హైదరాబాద్, ముంబైలో కోల్ గ్యాసిఫికేషన్‌పై రోడ్ షోలు

తాము తీసుకొచ్చిన సంస్కరణలతో ఇవాళ బొగ్గు దిగుమతి తగ్గుతోందన్నారు. గతేడాది 4 శాతం బొగ్గు దిగుమతులు తగ్గాయని, దీంతో రూ.60వేల కోట్లు ఆదా చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఈ దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. మైన్స్ ఎక్కువగా ఉన్న చోట.. రైల్వే లైన్లను వేస్తున్నామని, ప్రయివేటు రంగాన్ని కూడా బొగ్గు ఉత్పత్తిలో భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. పారదర్శకమైన పద్ధతి లో కోల్ బ్లాక్స్ వేలం వేస్తున్నామని తెలిపారు.

కోల్ ద్వారా సిన్‌గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు.. కోల్‌గ్యాసిఫికేషన్‌కు సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం రూ.46వేల కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. ప్ర స్తుతానికి సర్ఫేస్ గ్యాసిఫికేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు ప్రారంభించామని, ఈనెల 11న హైదరాబాద్‌లో కోల్ గ్యాసిఫికేషన్‌పై రోడ్‌షో ఏర్పాటుచేస్తున్నామన్నారు. వచ్చే వారం ముంబైలోనూ రోడ్ షో నిర్వహిస్తామన్నారు. ఒక కొత్త సప్లయ్ చైన్‌ను స్టార్ట్ చేయబోతున్నామన్నారు. 

క్రిటికల్ మినరల్స్ ఎకానమీ

స్టీల్ ఉత్పత్తిలోనూ మనం రెండో స్థానం లో ఉన్నామని, బైరైటీస్, మైకాలో కీలకంగా ఉన్నామని, జింక్ ఉత్పత్తిలో 3వ స్థానం, లైమ్ స్టోన్‌లోనూ 3వ స్థానం, బాక్సయిట్‌లో 5వ స్థానం ఉన్నామని కిషన్‌రెడ్డి వివ రించారు. అయితే క్రిటికల్ మినరల్స్‌లో చాలా వెనకబడి ఉన్నామన్నారు. మోదీ ఆలోచనల మేరకు.. రూ.32వేల కోట్ల నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించా మన్నారు. 20వ శతాబ్దం ఆయిల్ ఎకానమీ అయితే.. 21వ శతాబ్దం క్రిటికల్ మినరల్స్ ఎకానమీ అన్నారు.

క్రిటికల్ మినరల్స్ విషయంలో మనం 93 శాతం దిగుమతులు చేసుకుంటున్నామని, ఈ-వేస్ట్‌ను సేకరించి.. వాటి నుంచి క్రిటికల్ మినరల్స్ తీసే పనిలో ఉన్నామని చెప్పారు. ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో.. రేర్ ఎర్త్ ఎలిమెం ట్స్ కోసం స్పెషల్ మిషన్ ఏర్పాటుచేశామన్నారు. 24 క్రటిక్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, అర్జెంటీనాలో ౬ క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ తీసుకున్నామన్నారు.

మైనింగ్ లాభంలో 90 శాతం రాష్ట్రాలకే

మైనింగ్ ద్వారా అందే లాభంలో 90 శాతం రాష్ట్రాలకే అందుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. సింగరేణికి సంబంధించి రెండేళ్లలో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశానని, కోలిండియాతోపాటు సింగరేణి ఉద్యోగస్తులకు గతంలో రూ.30 లక్షలు, రూ.40 లక్షలుండే ప్రమాద బీమాను.. కోటి రూపాయలకు పెంచామన్నారు. తెలంగాణ ఉద్య మ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, సింగరేణి ఉద్యోగుల ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు చేస్తానని భరోసా ఇచ్చానని, దీనిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వా లను అడిగితే అప్పుడు వారు చేయలేదని, తాము 2028లో అధికారంలోకి రాగానే.. కచ్చితంగా వారికి ఆదాయపుపన్ను మినహాయింపు ఇస్తామన్నారు. 

మైన్ క్లోజర్ యాక్టివిటీ చర్యలు

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కూడా.. బొగ్గు తీయడమే తప్ప ఆ గనులను పూడ్చే పని జరగలేదని, తమ ప్రభుత్వం.. మైన్ క్లోజర్ యాక్టివిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 147 గనులను బొగ్గు తీసి వదిలేశామని, ఈ కోల్ మైన్స్‌ను సైంటిఫిక్ మెథడ్‌లో క్లోజింగ్ యాక్టివిటీ చేస్తున్నామన్నారు. 2028 నాటికి.. ఈ గనులను మూసివేయాలని నిర్ణయించుకున్నా మని, ఇందుకు 600 జిల్లాల్లో ఈ కమిటీలు వేశామన్నారు.

తాను కూడా డబ్ల్యూసీఎల్‌లో ఒక కోల్ బ్లాక్‌ను దత్తత తీసుకున్నానని, ఆ బ్లాక్ సైంటిఫిక్ పద్ధతిలో క్లోజ్ అయ్యేలా బాధ్యత తీసుకుంటామన్నారు. మైన్ క్లోజింగ్‌లో గిన్నిస్ రికార్డు సాధించాలనేది తన ఆకాంక్ష అన్నారు. ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. మైన్ క్లోజింగ్‌కు ముందు, మైన్ క్లోజింగ్ తర్వాత అనే విషయంలో వీడియోస్ సిద్ధం చేసి విడుదల చేస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. క్లోజ్ అయిన మైన్స్‌ను వాటర్ బాడీస్‌గా, సోలార్ పార్కులుగా.. చాలా మార్పులు చేస్తున్నామన్నారు.