9 June, 2026 | 1:43 AM

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

09-06-2026 01:05 AM
  1. 19 మంది మృతి.. 134 మందికి గాయాలు
  2. రిక్టార్ స్కేలుపై 7.8 తీవ్రత
  3. పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

మనీలా, జూన్ 8: ఫిలిప్పీన్స్‌లో సోమవా రం తెల్లవారుజామున భూకంపం సంభవించి, భారీ బీభత్సాన్ని సృష్టించింది. దక్షిణ మిండనావో ద్వీపం తీరంలో రిక్టార్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పౌర రక్షణ అధికారులు ధ్రువీకరించారు. మరో 134 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూకంపం ధాటికి వందలాది భవనాలు కళ్లముందే పేకమేడల్లా కూలిపోయాయి. ప్రధానంగా జనరల్ శాంటోస్ సిటీలో నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ ఉన్న మూడు అంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టమైంది. స్థానిక సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రి భవనం కూడా తీవ్రంగా దెబ్బతింది. దీంతో రోగులను, వైద్య సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి బయట తాత్కాలికంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

భూకంపం వచ్చిన సమయంలో రోడ్లపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పి ఊగిపోయాయి. ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశాయి. ఆ తర్వాత కొన్ని సెంటీమీటర్ల నుంచి 1.4 మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసి, హెచ్చరికలను ఉపసంహరించుకున్నాయి.