9 June, 2026 | 1:43 AM

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం

09-06-2026 01:05 AM

తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం

మరో ఆరుగురికి  తీవ్ర గాయాలు

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం

ఉక్కు ద్రవం తరలిస్తున్న బకెట్ కూలడంతోనే ఘటన

ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి, జూన్ ౮: ఏపీలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పట్ నిగమ్ లిమిటెడ్)లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్‌ఎంఎస్) నిట్‌లో కరుగుతున్న ఉక్కు ద్రవం లాడిల్ కిందపడి, ఉక్కు ద్రవం ఒలికి తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ప్లాంట్ యాజమాన్యం తక్షణం స్పందించింది. సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. ద్రవ ఉక్కు ఉన్న బకెట్‌ను క్రేన్ సాయంతో తరలిస్తున్న సమయంలో లాడిల్ వైర్లు తెగిపోవడంతోనే ప్రమాదం సంభవించిందని యాజమాన్యం తెలిపింది.

ప్రమాదం సంభవించిన సమయంలో ఉక్కు ద్రవం ఉష్ణోగ్రత 1,600 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనతో ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. కార్మికుల హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. స్టీల్ ప్లాంట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరణించిన తొమ్మిది మందిలో ఐదుగురు శాశ్వత ఉద్యోగులు కాగా, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.

మృతుల్లో శాశ్వత ఉద్యోగులను గొంతిన భానుకుమార్, జీవీ అప్పారావు, ఎం.కృష్ణనాగు, కె.ప్రభాకర్, గోల్డ్ కుమార్‌గా గుర్తించారు. కాంట్రాక్ట్ కార్మికులను రమణ, త్రినాథ్, ఎన్.అప్పలరాజుగా నిర్ధారించారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. మరోవైపు, ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) జిల్లా కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ప్లాంట్‌లో సరైన నిర్వహణ లేకపోవడం, పాతబడిన పరికరాలు ఉపయోగించడం, భద్రతా లోపాల వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కార్మికుల కుటుంబాలకు రూ.5 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు.