9 June, 2026 | 1:43 AM

మమతకు భారీ షాక్

09-06-2026 01:03 AM
  1. తృణమూల్ కాంగెస్‌కు ఎంపీ సుఖేందు రాజీనామా
  2. సీఎం సువేందుతో 20 మంది ఎంపీల భేటీ
  3. బెంగాల్ అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ వింగ్‌లోనూ తిరుగుబాటు
  4. ఎన్డీఏకు మద్దతు ఇస్తామని వెల్లడి

కోల్‌కతా, జూన్ 8: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్‌సీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న ఆమెకు కోలుకోలే నంత దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే సోమవారం తన ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా కీలక పాత్ర పోషించిన సుఖేందు నిష్క్రమణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  గత వారం జరిగిన చీలిక తరహాలోనే, ఇప్పుడు పార్లమెంటరీ వింగ్‌లోనూ తిరుగుబాటు మొదలైంది.

సుఖేందు రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఐదుగురు ఎంపీలు ఆయనతో కలిసి కనిపించారు. మరోవైపు టీఎంసీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యారు. తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తామంతా లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాస్తామని పేర్కొన్నారు. కాగా మమతా బెనర్జీ ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే ఈ పరిణామాలు జరిగాయి.

దీనివల్ల జాతీయ స్థాయిలో ఆమె బలం పూర్తిగా తగ్గిపోయింది. బెంగాల్ ప్రజలు తృణమూల్ అవినీతిని, మహిళలపై జరుగుతున్న అణచివేతను తిరస్కరించారని సుఖేందు తన రాజీనామా లేఖలో పేర్కొన్నా రు. విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బెంగాల్ చరిత్రలో మొదటిసారి బీజేపీకి ప్రజ లు భారీ విజయాన్ని అందించారని కొనియాడారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం అప్పుడే పనులు ప్రారంభించిందని అభినందించారు. ఇటీవల ఎన్నికల ఓటమి తర్వాత టీఎమ్సీ ఇప్పటికే రెండు ముక్కలైంది.