16 July, 2026 | 12:44 AM

పాడి పరిశ్రమ ద్వారా ఆర్థిక అభివృద్ధి

16-07-2026 12:00 AM
  1. రైతులకు 15.71 కోట్ల బోనస్ పంపిణీ
  2. త్వరలోనే మార్కెట్లోకి కొత్త పాల ఉత్పత్తులు
  3. ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి 

భీమదేవరపల్లి, జూలై 15 (విజయక్రాంతి): గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి, రైతు కుటుంబాల సంక్షేమానికి, నాణ్యమైన పాల ఉత్పత్తులకు ముల్కనూర్ స్వకృషి డెయిరీ అడ్రస్‌గా నిలిచి, కోట్లాది రూపాయలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నదని ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. ముల్కనూరు సకృషి మహిళా డెయిరీ 24వ వార్షిక మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పాడి రైతులు సాధించిన లాభాల నుంచి రూ.15.71 కోట్లు రైతులకు బోనస్ పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. డెయిరీ జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి వార్షిక నివేదికను చదివి వినిపించారు.

24 సంవత్సరాల కాలంలో డెయిరీ ఏకంగా రూ.2 వేల కోట్ల వ్యాపారం చేసింది. ఇందు లో రూ. వెయ్యి కోట్ల పాలను రైతుల నుంచే కొనుగోలు చేయగా.. సభ్యులకు రూ.139 కోట్ల బోనస్‌ను పంపిణీ చేయడం విశేషం. త్వరలోనే జున్ను కప్పులు, సబ్జా లస్సీ, షుగర్ లెస్ నెయ్యి వంటి మరికొన్ని సరికొత్త నాణ్యమైన ఉత్పత్తులను త్వరలో తెస్తామని చెప్పారు. డెయిరీలోని ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 2వ వార్డు నుంచి బొల్లంపల్లి చంద్రకళ (ముస్తఫాపూర్), 7వ వార్డు నుంచి మాందాడి శోభారాణి (శోడశపల్లి), 8వ వార్డు నుంచి కర్ర రమాదేవి (పీచర) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.