నౌహీరా షేక్ పీఏ నజ్నీన్ అన్సారీ అరెస్ట్
హైదరాబాద్: హీరా గ్రూప్ అధినేత్రి నౌహేరా షేక్(Heera Group Chairperson Nowhera Shaikh) పీఏ నజ్నీన్ అన్సారీ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు నజ్నీన్ అన్సారీని అరెస్ట్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తులను నౌహీరా షేక్ రెంట్ కు ఇచ్చారు. పెట్టుబడులపై భారీ రాబడులు ఇస్తామని వాగ్దానం చేసి దేశవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మందిని ఈ గ్రూప్ మోసం చేసింది. మనీలాండరింగ్ కేసులో గతంలో నౌహీరాను ఈడీ అరెస్ట్ చేసింది.
జప్తు చేసిన ఆస్తులకు అద్దె వసూలు చేయడం, అధికారులతో గ్రూపుకు మధ్యవర్తిగా వ్యవహరించడం వంటి ఆరోపణలు అన్సారీపై ఉన్నాయి. బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో సహాయపడటానికి ఉద్దేశించిన, కోర్టు ఆదేశించిన వేలం ప్రక్రియను ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఈడీ వెల్లడించింది. ఈ కుంభకోణం యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లోని ఎన్నారైల వరకు కూడా చేరింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నందున, అడ్డుపడటానికి ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈడీ హెచ్చరించింది.






