మందు పిరమే!
మద్యం ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 11 ( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకు త్వరలో బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. మద్యం ధరలను పెంచే అవకాశాలను రాష్ట్ర సర్కారు పరిశీలిస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచే అంశంపై గతవారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే మద్యం ధరలను పెంచే అంశంపై చర్చ జరిగినట్లు సచివాలయ వర్గాలు చెబుతు న్నాయి. దీంతో ధరలను ఏ స్థాయిలో పెంచాలనే అంశంపై ఎక్సైజ్ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అలాగే, డిస్టిలరీల లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా భారీగా పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.
ఏ అవకాశాన్ని వదలకుండా..
కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు భారీ ఎత్తున నిధులు అవసరం అవుతాయి. దీంతో నిధులను సమీకరించడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆదాయం తెచ్చే ఏ ఒక్క మార్గాన్ని కూడా వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆదాయం తెచ్చే శాఖల్లో ప్రధానంగా చెప్పుకునే ఎక్సైజ్‌పై దృష్టిసారించింది. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాబడిలో మద్యం వాటా గణనీయంగా ఉంటున్నది. గత ఐదేళ్లుగా మద్యం ద్వారా ఏటా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 30వేల కోట్లు సమకూరుతున్నాయి. ఈ క్రమంలో ధరలను పెంచడం ద్వారా మరికొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని గతవారం జరిగిన సమీక్షలో అధికారులు చెప్పినట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ సర్కారు మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. బ్రాండ్‌ను బట్టి రూ.10 నుంచి రూ.40 వరకు తగ్గించింది. ఈ క్రమంలో అప్పుడు తగ్గించిన ధరలను మళ్లీ పెంచడం ద్వారా మందుబాబుల నుంచి పెద్దగా వ్యతిరేకత కూడా రాదనే అభిప్రాయాన్ని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే.. అంతే పెంచాలా? లేకుండా దానికి అదనంగా ఏమైనా జోడించాలా? అనే అంశాలను ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తోంది. దీనిపై తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీ)తో అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లలో రెండుసార్లు పెంపు
గత ఐదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మద్యం ధరలు రెండుసార్లు పెరిగాయి. కరోనా మొదటి వేవ్ తర్వాత 2020లో ఒకసారి, 2022లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ధరలను పెంచితే.. రేవంత్ హాయంలో మొదటిసారి మద్యం రేట్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 500బ్రాండ్స్ లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబుల కోసం ప్రభుత్వం మరికొన్ని కొత్త బ్రాండ్స్‌కు అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాది రాష్ట్ర రాబడిలో మద్యం వాటా రూ.10వేల కోట్లు మాత్రమే. కానీ ఆ తర్వాత అది ఏకంగా రూ.30వేల కోట్లకు చేరడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ సమీకరణలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మద్యం ధరలను పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది.






