27 February, 2026 | 2:42 AM

నిద్రావస్థలో విద్యా వ్యవస్థ

27-02-2026 12:41 AM

గుండాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వేల జీతాలు తీసుకుంటూ, భావి తరాలకు బాటలు వేయాల్సింది పోయి కనీసం పిల్లలకు చదువు చెప్పకపోగా కడుపునిండా తిని పాఠశాలలోనే కంటి నిండా నిద్ర పోతున్న దుస్థితి ఏర్పడింది. మండల పరిధిలోని గలభ ప్రాథమిక పాఠశాలలో మధ్యా హ్నం నిద్రపోతున్న టీచర్ ఇందుకు నిదర్శనం.

మండల విద్యాశాఖ అధికారి, మం డల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతమ్మ విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టకపోగా, కనీసానికి పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. మండల విద్యాశాఖ అధికారి అయినప్పటికీ కనీసం మండల పరిధిలోని పాఠశాలను తనిఖీ చేయకపోగా, మేము చేసే పనిమాకు తెలుసు అనే వ్యవహార శైలి అనుసరిస్తున్నారని వినికిడి. అసలే ఏజెన్సీ, వెనుకబడిన  ప్రాంతమైన గుండాల మండలంలో నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చామా,

వెళ్ళామా ధోరణితో ఇంకా ఈ ప్రాంతం వెనకకు వెళుతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నేటితరం ప్రైవేట్ పరంగా కొత్త పుంతలు తొక్కుతున్నా గిరిజనులకు తమ గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఆశ్రయించక తప్పడం లేదు. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి, ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై, సరైన విధి నిర్వహణ చేయని మండల విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీప్రాంత తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.

మండల విద్యాశాఖ అధికారి వివరణ

మండల విద్యాశాఖ అధికారిని ఛరవాణిలో వివరణ కోరగా మేము అన్ని పాఠశాలలను తనిఖీ ఎలా చేస్తాం, ఆయన ఆ సమయంలో అలా పడుకుంటారని మాకేం తెలుస్తుందని దురుసుగా సమాధానం ఇచ్చారు.