23 July, 2026 | 3:31 AM

నిరసన తెలిపితే పాశవిక దాడులా?

23-07-2026 03:01 AM
  1. రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందింది
  2. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రం
  3. నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారు
  4. కొడంగల్ ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి

కొడంగల్, జూలై 22 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీపై పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పాశవిక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల పాశవిక దాడులపై కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తన నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టి, స్థానిక అంబెద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకుని బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనకు రాజకీయాలకు అతీతంగా పార్టీలు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి.. విద్యార్థులపై పాశవికంగా దాడి జరుపుతారా అంటూ ప్రశ్నించారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండా పోయారని,  వారిని ఎక్కడికైనా తీసుకెళ్లా రా? ఎవరైనా కిడ్నాప్ చేశారా అని సందేహం వ్యక్తం చేశారు.  శాంతియుతంగా  నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పై పాశవికంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.

పాశవిక దాడితో రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందిందని, దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని చెప్పారు.  ప్రజా స్వామ్యంలో  నిరసన తెలపడం అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కు అని, పేపర్ లీక్‌పై పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రధాని అడ్డుకున్నారని విమర్శించారు.

దేశాన్ని దోచుకుంటున్న నరేంద్ర, ధర్మేంద్ర

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 2019లో ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడిందని గుర్తు చేశారు. ఆ సంస్థ 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొందన్నారు. అనుభవం, అర్హత లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లతో ఆనాడు కేటీఆర్ తన బినామీ సంస్థ గ్లోబరీనాకు ప్రాజెక్టును అప్పగించిందని ఆరోపించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని గ్లోబరీనా సంస్థ కోఎంప్ట్ ఎడ్యుకేషన్‌గా పేరు మార్చుకుని గ్లోబరీనా సంస్థ కేంద్రం వద్దకు వెళ్లిందని, ఢిల్లీ బీజేపీ వాళ్లతో మాట్లాడుకుని వాళ్లకు కేటీఆర్ కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహించడంతో దొంగతనం చేయొచ్చన్న ధైర్యం వాళ్లకు వచ్చిందని విమర్శించారు.

సీబీఎస్‌ఈలో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్‌పై విద్యార్థులు నిరసన తెలిపారని, ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించకుండా విద్యార్థుల తలలు పగలగొట్టారని కేంద్రం వైఖరిని సీఎం తప్పుపట్టారు. అంతకుము  కొడంగల్‌లోని తన నివాసంలో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం... పార్టీ నేతలు, కార్యకర్తలతో క లిసి  అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరారు.  ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులున్నారు.