23 July, 2026 | 3:45 AM

విద్యా విధానమే రిగ్గయ్యింది

23-07-2026 03:09 AM

గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయి

  1. ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు
  2. ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్య
  3. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

3 డిమాండ్లు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యా ర్థులపై దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసు కోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. పార్లమెంట్‌లో చర్చించక పోతే, ధర్నాలు తప్పవు.

- రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, జూలై 22: బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజీలు జరిగాయని, అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగినా ఒక్కరికి కూడా శిక్ష పడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.  జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ సమీపం వరకు సోమ వారం విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని రాహుల్ అన్నారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏమిటని నిలదీశారు.

దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధ వారం ఆయన మీడి యాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. విద్యా వ్యవస్థలో నెల కొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీకులు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  పరీక్ష పేపర్ల లీకులకు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. 

అన్నీ అక్రమాలే..

‘అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు.

కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.

ఈ గణాంకాలు ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్‌కు దాదాపు సమానం. ప్రజల నుంచి పన్నులు వసూలుచేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ.1.4 లక్షలకోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం’ అని రాహుల్ అన్నారు.

విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని ధ్వజమెత్తారు. ‘ఎవరో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం మన విద్యా వ్యవస్థను, దేశ అత్యంత విలువైన ఆస్తిని నాశనం చేస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది?’ అని ప్రశ్నించారు.

అందుకే మెరుపు ధర్నా..

విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నివాసం వద్ద ప్రతిపక్ష నాయకుడు ధర్నాకు దిగడమేమిటి? అని బీజేపీ విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ‘నీట్  పేపర్ లీక్‌పై, విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలనే అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం మిన్నకుంది. ఇక లాభంలేదని కాంగ్రెస్ ప్రధాని నివాసం వద్ద ధర్నా చేసింది. యువత ఆగ్రహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా. ప్రస్తుత పరిస్థితుల్లో మా ధర్నా తప్పు కాదు.’