04-12-2025 12:01:17 AM
తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి
ఘట్ కేసర్, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ కొండాపూర్ లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎడ్యునేట్ ఫౌండేషన్ టాస్క్, ఐబీఎం స్కిల్స్ బిల్ సంయుక్తంగా నిర్వహించిన టెక్ ఎడ్యుకేటర్స్ సమ్మిట్ ఫ్యాకల్టీ బిల్ ఏ తాన్ 2025 బుధవారం ఘనంగా జరిగింది.
పవర్ ఆఫ్ ఏజెన్టిక్ ఏఐ విత్ ఐబీఎం గ్రానైట్ అండ్ ల్యాండ్ ఫ్లో అనే అంశంపై ఆధారంగా ఈ బిల్డ్-ఎ-థాన్ నిర్వహించబడింది. మొత్తం 200 మంది అధ్యాపకులు పాల్గొనగా, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 60 మంది ఫ్యాకల్టీలకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఏ.వి. రమణారెడ్డి, ఎస్.వి.ఆర్ అసోసియేట్ పార్ట్నర్, ఐబిఎం కన్సల్టింగ్ అనిల్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతం నుండి వర్తమానం వరకు టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఆ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీని సృజనాత్మకంగా వినియోగిస్తే దేశం ప్రపంచ పోటీలో ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు.
విద్యాసంస్థలు ఇండస్ట్రీతో కలిసి పని చేసి కొత్త ప్రయోగాలను చేపట్టాలని సూచించారు. ఫ్యాకల్టీలు కొత్త టెక్నాలజీలను నేర్చుకొని విద్యార్థులకు అందిస్తేనే విద్యా నాణ్యత మరింత మెరుగవుతుందని అన్నారు. టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా , చైర్మన్ ఏ.వి. రమణారెడ్డి కూడా ప్రసంగించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. జానకి రాములు, కార్యక్రమ కన్వీనర్ పి. అరుణ్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.