16 April, 2026 | 3:09 AM

గ్రామాల్లో సమగ్ర అభివృద్ధికి కృషి

16-04-2026 01:34 AM
  1. జీపీల్లో వసతుల కల్పనకు చర్యలు

కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, ఏప్రిల్ 15: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ మీటింగ్ హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో కలిసి ఎంపిక చేసిన 7 గ్రామాల సర్పంచ్ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాలను  ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

చెన్నూర్ మండలంలోని సుందరశాల, దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట, హాజీపూర్ మండలంలోని హాజీపూర్, జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రొమ్మిపూర్, కన్నెపల్లి మండలంలోని సాలిగాం, తాండూర్ మండలంలోని చౌటుపల్లి, వేమనపల్లి మండలంలోని బయ్యారం గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 100 శాతం నిధులతో పథకం అమలు  చేయడం జరుగుతుందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు నిధులను కేటాయించవచ్చన్నారు.

మొత్తం నిధులలో కొంత శాతం పరిపాలనా వ్యయాలు, శిక్షణ, సామాజిక ఆడిట్, అవగాహన కార్యక్రమాలు, మూల్యాంకనం వంటి కార్యకలాపాలకు వినియోగించబడుతుందని తెలిపారు. ఎంపిక చేయబడే గ్రామాలు సాధారణంగా 40 శాతం కంటే ఎక్కువ  షెడ్యూల్ కులముల జనాభా కలిగి ఉండాలని, కనీసం 500 జనాభా ఉండాలని తెలిపారు.

ప్రణాళిక గ్రామ సభ ఆమోదం పొందిన తరువాత జిల్లా స్థాయి కమిటీకి పంపించి ఆమోదం పొందుతుందని తెలిపారు. పథకం అమలులో భాగంగా గ్రామ స్థాయి సమన్వయ కమిటీలు, జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయి కమిటీ, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ పనిచేస్తూ పథకం అమలు, పర్యవేక్షణ, సమన్వయం వంటి బాధ్యతలను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖల అధికారులు, ఎంపిక చేయబడిన 7 గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.