21 May, 2026 | 4:38 PM

సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు చేయాలి

21-05-2026 03:43 PM

పాపన్నపేట,మే21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలో సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులను మినహాయించడం హేయమైన చర్యని తపస్ మెదక్ జిల్లా కార్యదర్శి మంగ నర్సింలు పేర్కొన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రతిపాదించిన నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలులో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రిటైర్డ్ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న వివక్షను వ్యతిరేకించారు.

ఉద్యోగంలో ఉన్నంత కాలం మూల వేతనం నుండి 1.5 శాతం నిధులను కట్ చేసుకుని క్యాష్‌లెస్ వైద్యం అందించి, రిటైర్ అయిన మరుక్షణమే హెల్త్ కార్డులు చెల్లవనడం ఏ రకమైన న్యాయం? అని ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా వృద్ధాప్యంలోనే వైద్యం అత్యంత అవసరమన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులందరికీ నూతన హెల్త్ స్కీం కింద పూర్తి స్థాయి క్యాష్‌లెస్ వైద్యం అందేలా జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.