18 April, 2026 | 2:27 PM

ఏకలవ్య మోడల్ పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆందోళన

01-11-2025 12:01 AM

రెండు రోజులుగా విద్యుత్తు, నీళ్లు లేకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులు

ములకలపల్లి, అక్టోబర్ 31, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో మూక మామిడి ప్రాజెక్టు సమీపాన నెలకొల్పిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో గత రెండు రోజులుగా విద్యుత్తు, నీళ్ల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేక మోటార్లు పనిచేయకపోవడంతో నీళ్ల సమస్య ఏర్పడింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు శుక్రవారం పాఠశాలలోనే ఆందోళనకు దిగి నిరసన తెలిపారు.

సమస్యను ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బందికి తెలియజేసినప్పటికీ వారు స్పందించ లేదని విద్యార్థులు వాపోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీటి మోటార్లు పనిచేయడం లేదు. నీటి సరఫరా లేక రెండు రోజుల నుంచి స్నానాలు కూడా చేయలేదని, మురికి దుస్తులతోనే తరగతులకు హాజరు కావడం ఇబ్బందిగా మారిందని ఆరోపిస్తూ విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా పాఠశాల ఆవరణలోనే ఆందోళనకు దిగారు. రాత్రి వేళలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చీకట్లోనే దోమల బెడదతో నిద్ర కూడా పోవడం లేదని విద్యార్థులు వాపోయారు.

తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని బయట ప్రపంచానికి తెలియజేసేందుకు విద్యార్థులు మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను సిబ్బంది అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ పాఠశాలలో నార్త్ ఇండియన్ కు చెందిన అధ్యాపక సిబ్బంది,ప్రిన్సిపాల్ ఉన్నారు. వీరి భాష విద్యార్థులకు, విద్యార్థుల భాష వీరికి అర్థం కాక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏకలవ్య మోడల్ పాఠశాలలో నెలకొన్న విద్యుత్తు తాగునీటి సమస్యను పరిష్కరించి విద్యార్థుల సంక్షేమం దిశగా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.