3 April, 2026 | 3:14 AM

ఎల్ నినో ముప్పు!

03-04-2026 12:00 AM

పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన కొరత ఇప్పటికే భయాన్ని నింపింది. గ్యాస్ కొరతతో అప్రకటితంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య సిలిండర్ల చార్జీలు పెరగడంతో హోటల్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఇప్పుడిప్పుడే నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ముగిసేదెన్నడు అని అంతా ఎదురుచూస్తున్నారు. పంటలకు అవసరమైన ఎరువులపై ఈ యుద్ధ ప్రభావం ఎలావుంటుందోనని దేశంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పలు సమస్యలతో ఈ ఎండాకాలం మంటపుట్టించనున్నదనే భయాల మధ్య ఈ ఏడాది దేశ వ్యవసాయ రంగంపై ఎల్ నినో తన పంజా విసరనున్నదనే సంకేతాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వచ్చే జూన్ నుంచి ఆగస్టు వరకు ఎల్ నినో ప్రభావం 62 శాతం వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 80 శాతం వరకు ఉండవచ్చునం టూ వాతావరణ విభాగం దేశ రైతాంగానికి పిడుగులాంటి వార్త చెప్పింది. పశ్చిమాసియా యుద్ధంతో ఎరువులు సరిపడా దొరుకుతాయా అని ఆం దోళనలో వున్న అన్నదాతకు ఈ ఎల్ నినో ముప్పు సవాలుగా పరిణమించింది.

తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో వేడినీటి ప్రవాహం వల్ల ఎల్ నినో ప్రభావం మొదలవుతుంది. దీనితో కరువు పరిస్థితులు ఏర్పడుతుంటాయి. రుతుపవనాల ప్రభావం తగ్గిపోతుంది. జూన్ నుంచి సెప్టెంబర్ రైతన్నలకు కీలకమైన కాలం. ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఎరువుల వాడకం పెరిగే అవకాశం వుంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఈ కాలంలో ఎక్కువగా ఎరువులపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. రుతుపవనాలు తగ్గి పంట దిగుబడి తగ్గిపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గుతుంది.

ఇటు యుద్ధం వల్ల అప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగితే ఎల్ నినో వల్ల వర్షాభావ పరిస్థితులు, ఎరువుల కొరత అన్నదాతను కుంగతీస్తుంది. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలంటే మంచి వర్షాలు, పంట దిగుబడి అత్యవసరం. సహజ వాయువు తోబాటు ఎరువుల దిగుమతి మన గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థకు కీలకం. అనేక రకాల ఎరువులు మన పంటలకు అవసరమవుతాయి. ఎల్ నినోతో డిమాండ్ పెరిగితే కష్టకాలం ఎదురవుతుంది. ముప్ఫు ఏళ్లలో.. 2009లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపించింది.

ఏడు దశాబ్దాల కాలంలో భారత్‌లో 11 సార్లు ఎల్ నినో వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావిత మైంది. 2024-25లో రికార్డు స్థాయిలో 357 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఈసారి ఎల్ నినో ప్రభావం, యూరియా అందుబాటు అనేది మన వ్యవసాయ రంగ ఉత్పత్తులను నిర్దేశించనున్నాయనడంలో సందేహం లేదు. ఖరీఫ్ పంటల సాగు, మత్స్య పరిశ్రమకు ముప్పు కలిగే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమ వడమే రైతన్నల ముందున్న ఒక పరిష్కారం.

ఇందుకు రైతాంగం చిరుధా న్యాలు, ఆరుతడి పంటలను ఎంచుకోవడమే మంచిది. పశుగ్రాసం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి పద్ధతులను అన్వేషించాలి. బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతుల వైపు దృష్టి సారించాలి. ఆహార ఉత్పత్తి తగ్గడం, ఎరువుల సరఫరాలో అంతరాయాల వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్ప డుతాయి. వచ్చే సంవత్సరం వరకు వర్షపాతం భారీగా పడిపోయినా ఆహార ఉత్పత్తి దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.