3 April, 2026 | 3:08 AM

ప్రాణాంతకంగా టైప్-5 మధుమేహం

03-04-2026 12:00 AM

టైప్-5 మధుమేహం.. ఇది అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చెందిన బక్క చిక్కిన నిరుపేద యువత పోషకాహార లోపానికి సంబంధించిన ప్రమాదకర డయాబెటిస్. ఈ విష వలయంలో బంధించబడి ప్రాణాలను సహితం కోల్పోతున్నారని ఇటీవల విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. నేటి వరకు ఈ టైప్-5 వ్యాధి పట్ల వైద్య రంగమే అయోమయంలో కూరుకుపోవడంతో వ్యాధిగ్రస్తుల బతుకులు గాల్లో దీపాలు అయ్యాయి.

సంపన్నులతో పాటు మధ్యాదాయ కుటుం బాలు మితిమీరిన ఆహారపు అలవాట్లతో అధిక బరువు చెరలో చిక్కి టైప్-2 మధుమేహం వలలో పడుతున్నారని, ఇన్సులిన్ సూది మందుతో అదుపు చేస్తున్న టైప్-1 మధుమేహం గూర్చి మనకు తెలుసు. ఇలాంటి స్థూలకాయ రుగ్మతగా టైప్-2 మధుమేహం, ఇన్సులిన్‌తో అదుపు చేయగల టైప్-1 డయాబెటిస్ గూర్చి మనకు తెలిసినప్పటికీ నేడు పోషకాహారలోప సం బంధ మధుమేహం గూర్చి మనకు చాలా పరిమితంగా తెలుసు.

ఇలాంటి పోషకాహారలోపం డయాబెటిస్‌ను నేడు టైప్-5 డయాబె టిస్‌గా నేడు అధికారికంగా నామకరణం చేసి గుర్తిస్తున్నామని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించడం ఒక మంచి పరిణామంగా తీసుకోవాలి. టైప్ 5 ఒక జన్యుపరమైన రుగ్మత, ఇది కణ స్థాయిలో క్లోమం యొక్క పనితీరును లేదా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఈవ్యాధికి ప్రధాన కారణం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆటోసోమల్ డామినెంట్ పద్ధతిలో సంక్రమించే జన్యు మార్పు.

ఇప్పటి వరకు పోషకాహారలోప సంబంధ మధుమేహ వ్యాధి పట్ల అవగాహన, పరిజ్ఞానం తక్కువగా ఉందని, సరైన చికిత్స కూడా లేకపోవడం విచారకరమని, నేడు టైప్-5 మధుమేహాన్ని గుర్తించడం, చికిత్స మార్గాలను నిర్ధారించడం, పరిశోధనలను కొనసాగించడం సత్వరమే కొనసాగడానికి ఈ గుర్తింపు దోహదపడుతుందని వైద్యులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా యువత టైప్-5 మధుమేహ కోరల్లో చిక్కుకున్నారని, వీరిలో అధిక శాతం ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన అభాగ్యుల ఉన్నారని తెలుస్తున్నది.

గత ఏడు దశాబ్దాలుగా గుర్తించబడిన పోషకాహారలోప మధుమేహం పట్ల సరైన చూపుపడలేదని, నేడు దీనినే టైప్-5గా నామకరణం చేయడంతో ఈ వ్యాధి కట్టడికి ప్రపంచ వైద్య సమా జం దృష్టి పెడుతుందని ఆశిస్తున్నారు. 1985లోనే దీనిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, తర్వాత సరైన అవగాహనకు రాకపోవడంతో ఆ గుర్తింపును 1999లో వెనక్కి తీసుకోవడం జరిగిన విషయం మనకు తెలుసు.

నాటి టిబీ, హెచ్‌ఐవి/ఏయిడ్స్ వలె నేడు పోషకాహారలోప టైప్-5 మధుమేహం పేదరిక యువతకు ప్రమాదకరంగా మారడం కడు విచారకరం. దీనిని తొలి దశలో గుర్తించడం ఒక ఉత్తమమైన మార్గంగా పేర్కొంటున్న వేళ ప్రపంచ పౌర సమాజం దీని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నారు.

పోషకాహారలోపం వల్ల ఏర్పడుతున్న టైప్-5 మధుమేహం పట్ల ఇప్పటి నుంచైనా తగిన చికిత్సలు, రోగ నిర్థారణ పరీక్షలు, వ్యాధి కట్టడికి నూతన మార్గాలను చూపగల పరిశోధనలు ముమ్మరం కావాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల యువత టైప్-5 వ్యాధి చెరలోంచి బయటపడి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుందాం, టైప్-5 డయాబెటిస్‌కు తగు చికిత్సలను కనుగొనే రోజుల కోసం ఎదురుచూద్దాం. 

 డా: బుర్ర మధుసూదన్ రెడ్డి 

99497 00037