దండె విఠల్ ఎన్నిక చెల్లదు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు షాక్
కాంగ్రెస్ అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేశారు
ఫొరెన్సిక్ పరిశోధన ఆధారంగా తీర్పు
సుప్రీంకు వెళ్తా: విఠల్
హైదరాబాద్, మే 3, (విజయ క్రాంతి): ఆదిలాబాద్ స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ ఎన్నిక తిరిగి నిర్వహించాలని తీర్పులో పేర్కొంది. ఎన్నికల పోటీలో పిటిష నర్ రాజేశ్వర్‌రెడ్డి లేనందున ఆయన ఎన్నికైనట్లుగా ప్రకటించేందుకు ఆస్కారం లేదని వెల్లడించింది. పిటిషనర్ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డికి కోర్టు ఖర్చుల కింద రూ. 50వేలు చెల్లించాలని విఠల్‌ను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేసేందుకు వీలుగా దీని అమలును 4 వారాలపాటు నిలిపివేయాలని విఠల్ తరఫు న్యాయవాది చేసిన వినతిని ఆమోదించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం అత్యంత కీలక తీర్పును వెలువరించారు.
అదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తే దానిని రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ చేశారు. పనుల నిమిత్తం హైదరాబాద్‌కు రాజేశ్వర్‌రెడ్డి వచ్చారు. 2021 నవంబరు 28న ప్రకటించిన తుది జాబితాలో రాజేశ్వర్‌రెడ్డి పేరు లేదు. దీనిపై ఆరా తీస్తే దస్తూరాబాద్ ఎంపీపీ కిషన్ సింగారి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలిసింది. ఆ విధంగా చేసేందుకు కిషన్‌కు ఆథరైజేషన్ కూడా ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ నాయకుల బలవంతంతో ఇదంతా జరిగిందని, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా సహకరించారని, ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ రాజేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయిం చారు. పిటిషనర్ సంతకం గురించి హైకోర్టు ఢిల్లీలో కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిర్ధారణ చేసుకుంది.
సంతకం ఫోర్జరీదేనని తేలడంతో ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. నామినేషన్ ఉపసంహరణ నిమిత్తం కిషన్ ఇచ్చిన ఫారంను ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువీకరణ చేసుకోలేదని తప్పుపట్టింది. ఫలితంగా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారని పేర్కొంది. విఠల్, కిషన్ కుమ్మక్కయ్యారని, అయితే రిటర్నింగ్ అధికారి ఆ ఇద్దరితో కుమ్మక్కు అయ్యారనే ఆధారాలు పిటిషనర్ చూపలేదని చెప్పింది. నామినేషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ ఎలక్షన్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నికైనట్లుగా 2021 డిసెంబర్ 14న వెలువరించిన ప్రకటన, ఆ తర్వాత రోజు ప్రభుత్వం వెలువరించిన గెజిట్ చెల్లదని తేల్చింది. చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించనందున విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది.
సుప్రీంకు వెళ్తా: విఠల్
హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్టు దండె విఠల్ తెలిపారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చిందని, ఆ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో తనకు సంబంధం లేదని స్పష్టంచేశారు. తనకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు.




