29 March, 2026 | 4:35 PM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి

04-05-2024 12:45 AM

నల్లగొండ , ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. గత సంవత్సరం నవంబర్ 4న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. రాకేశ్ రెడ్డి స్వగ్రామం హన్మకొండ  జిల్లాలోని హసన్‌పర్తి మండలం వంగపహాడ్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్స్ మేనేజ్‌మెంట్  స్టడీస్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ పూర్తి చేశారు. సిటీ బ్యాంక్ మేనేజర్‌గా, జేపీ మోర్గాన్, ఫేస్‌బుక్ లాంటి పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల్లో  బెంగుళూరు, అమెరికాలో పనిచేశారు. ఏడేళ్ళ పాటు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

2013లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో బీజేవైఎం రాప్ట్ర  కార్యదర్శిగా రెండు పర్యాయాలు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. బీజేపీలో వరంగల్  పశ్చిమ టికెట్‌ను ఆశించిన రాకేశ్ రెడ్డి అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించక పోవడంతో 2023 నవంబర్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.  యువతలో, విద్యావంతులలో మంచి పట్టు ఉన్న రాకేష్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ఫాలోయింగ్ ఉండటంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును కేసీఆర్ ప్రకటించారు.