29 March, 2026 | 1:27 PM

ఆరున్నరేండ్ల మెట్రో పరుగులు 50 కోట్ల ప్రయాణికులు

04-05-2024 12:50 AM

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే మైలురాయి

ఘనంగా గ్రీన్‌మైల్స్ లాయల్టీ క్లబ్ ఆవిష్కరణ

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో వేడుకలు

ఇలాంటి క్లబ్ ఏర్పాటు ప్రథమం: ఎన్వీఎస్ రెడ్డి

50 కోట్ల ప్రయాణికురాలు రాజశ్రీకి సన్మానం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): ఆరున్నరేండ్ల హైదరా బాద్ మెట్రో రైల్ అరుదైన ఘనత సాధించింది. మెట్రో రైల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఇందులో 50 కోట్ల మంది ప్రయాణించారు. శుక్రవారం నాటికి మెట్రోరైళ్లలో 54 కోట్ల మంది ప్రయాణించారని సంస్థ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో శుక్రవారం కస్టమర్ గ్రీన్‌మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలో ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు గుర్తుండే అనుభవాలు కల్పించటం కోసం లాయల్టీ ప్రోగ్రాంను ప్రారంభించినట్టు చెప్పారు. మెట్రోరైళ్ల వల్ల 14.5 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నదని వెల్లడించారు.

రోజూ సగటున మైట్రోరైళ్లలో 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండోదశ మెట్రోరైలుకు సంబంధించి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) లు సిద్ధమయ్యాయని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం పనులపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. గ్రీన్‌మైల్స్ లాయల్టీ క్లబ్ మెట్రోను ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపేందుకు రూపొందించిన విశిష్ట కార్యక్రమమనీ ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు. 50 కోట్ల మైలురాయి ప్రయాణికురాలు రాజశ్రీని ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీ రెడ్డి ఈ సందర్భంగా సన్మానించారు. రూ.10 వేల వోచర్ పొందిన భాస్కర్, ఇందు, సరోజ, మియాపూర్ మార్గంలో ప్రయాణించే సురేందర్‌రెడ్డి, శశిని సన్మానించారు. 

గ్రీన్‌మైల్స్ లాయల్టీ ఉద్దేశ్యాలు ఇవే

నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు వినూత్న అనుభూతులను అందించేలా రూపొందించిందే కస్టమర్ లాయల్టీ పథకం. మెట్రోలో తరచూ ప్రయాణించేవారికి ప్రోత్సాహకాలు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. క్యాలెండర్ నెలలో ప్రయాణించిన ట్రిప్పులను బట్టి స్మార్ట్‌కార్డులను ఉపయోగించే ప్రయాణికులకు పాయింట్లు లభిస్తాయి. సరుకులు, లక్కీ డ్రా గిఫ్టులు మొదలైన వాటి కోసం ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. పర్యావరణ అనుకూల ప్రయాణం వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు కూడా దోహదం చేస్తోంది. 

కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం ఎలా పని చేస్తుందంటే?

ప్రయాణాలకు స్మార్ట్‌కార్డులను ఉపయోగించేవారంతా దీనికి అర్హులే. క్యాలెండర్, నెలవారీగా ట్రిప్పులు లెక్కించబడతాయి. నిర్ధిష్ట ప్రోత్సాహకాల అంచెలను అందుకోవడానికి ప్రయాణికులు వరుసగా మూడు నెలల పాటు నిర్ధిష్ట సంఖ్యలోట్రిప్పులను నమోదుచేసి ఉండాలి.

లాయల్టీ విభాగాలు

గీన్‌మైల్స్ లాయల్టీలో సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే మూడు విభాగాలుంటాయి. ప్రతి విభాగంలో నిర్ధిష్ట సంఖ్యలో ట్రిప్‌లు అవసరమవుతాయి. ఈ దశను బట్టి ఉచిత ట్రిప్పులు, ఎక్స్‌క్లూజివ్ సరుకులు, ఆకర్షిణీయమైన బహుమతులు అందించే లక్కీడ్రా పోటీల్లో పాల్గొనేందుకు అవకాశాలు వంటి పలు ప్రయోజనాలుంటాయి.

ట్రిప్పులు బహుమతులు

40 కీచైన్స్, క్యాప్స్, బ్రాండెడ్ నోట్ ప్యాడ్స్

50 మగ్స్, మొబైల్ స్టాండ్స్

61 ట్సీషర్ట్స్

71 ట్రిప్పులకంటే ఎక్కువ మోడల్ ట్రైన్ సెట్