మట్టి అక్రమ రవాణాకు అడ్డే లేదా!
- మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట ఎప్పుడు?
- అధికారుల మౌనం వెనుక అంతర్యమేమి
- మట్టి తరలింపు అనుమతి ఇవ్వలే : నర్సింగ్ రావు, జడ్చర్ల తాసీల్దార్
జడ్చర్ల, మే 8: మండల పరిధిలోని కరివేన ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు.అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కర్వేన ప్రాజెక్టు నుంచి అలాగే ఉదండాపూర్ ప్రాజెక్టు నుం చి మట్టి అక్రమ రవాణా చేస్తూ జడ్చర్లకు తరలిస్తున్నారు.
గ్రామాల పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, పంట పొలాలను లక్ష్యంగా చేసుకున్న మట్టి మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు చేసి ప్రైవే ట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారని ప్రజలు చెబుతున్న మాట. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో మట్టిని తవ్వి ట్రాక్టర్లు,టిప్పర్ల ద్వారా తరలిస్తున్న దృశ్యా లు స్థానికులకు నిత్యకృత్యంగా మారాయి. ప్రత్యేకించి రాత్రి వేళల్లో ఈ అక్రమ రవాణా మరింత జోరుగా కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వరుసగా వెళ్తున్న మట్టి రోడ్ల వాహనాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రామీణ రహదారులపై వేగంగా దూసుకెళ్తున్న టిప్పర్ల కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రభావశీల వ్యక్తుల అండతోనే ఈ అక్రమ దందా నడుస్తోందట. అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది.
అక్రమ రవాణా అధికారులకు మాత్రమే కనిపించవా?
అక్రమంగా మట్టి తవ్వకాల కారణంగా పంట భూములు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతుల భూముల వద్ద లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని చెబుతున్నారు.ఇక మరోవైపు మట్టి తరలింపుతో గ్రామాల్లో దుమ్ము కాలుష్యం పెరిగిపోతోంది. రోడ్లపై ఎగిసిపడుతున్న దుమ్ముతో చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలకు వెళ్లే వి ద్యార్థులు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు.
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా చేతుల్లోకి వెళ్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎక్కువ మట్టిని తరలిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ సంపాదన కొనసాగుతోందని అంటున్నారు. అయినప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి సరైన పర్యవేక్షణ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
తనిఖీల కంటే ముందు.. మట్టి మాఫియా కు సమాచారం
కొన్ని ప్రాంతాల్లో అధికారుల తనిఖీలు జరగబోతున్నాయనే సమాచారం ముందుగానే మట్టి మాఫియాకు చేరుతోందట. దీంతో అధికారులు వచ్చే సమయానికి వాహనాలు మాయం అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అక్రమ మట్టి రవాణా వల్ల ఇప్పటికే అనేక గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి.
భారీ లోడ్లతో వెళ్లే ట్రాక్టర్లు, టిప్పర్ల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో లైట్లు లేకుండా వెళ్తున్న వాహనాలు మరింత ప్రమాదకరంగా మారుతు న్నాయి.అక్రమ మట్టి రవాణాను అడ్డుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతమని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టాలని, సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు.
మట్టి తరలింపుకు అనుమతి ఇవ్వలే
ప్రస్తుతం మండలంలో ఎవరికి కూడా మట్టి తరలింపు కు ఎటువంటి అ నుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు.ఎమ్మార్వో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. అనుమతులు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మట్టి రవాణా ఎలా జరుగుతోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమం గా మట్టి తరలించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
నర్సింగ్ రావు, జడ్చర్ల తహసీల్దార్,
మహబూబ్ నగర్ జిల్లా






