ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
- కరెంట్ స్తంభం ఏర్పాటులో లంచం డిమాండ్
- రూ. 25 వేలు తీసుకుంటుండగా పట్టివేత
జిన్నారం (అమీన్‌పూర్), జూన్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఓ ప్రైవేట్ వ్యక్తి నుంచి రూ.25,000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఐడీఏ బొల్లారంలోని పీపీఆర్ ఆసుపత్రి సమీపంలో ఇటీవల ఒకకారు నియంత్రణ కోల్పోయి విద్యుత్ స్తంభాన్ని బలం గా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ కాంట్రాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి రిపేర్ పనులు పూర్తి చేశారు.
కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనపై ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాకుండా చూస్తానని, అలాగే శాఖాపరమైన ఇబ్బందులు లేకుండా చేస్తానని సదరు బాధితుడి నుంచి ఏఈ రామకృష్ణారెడ్డి రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ద్వారా నగదు తీసుకుంటున్న సమయంలో అధికారు లు ఏఈని అరెస్టుచేశారు. రికార్డులు, లావాదేవీలను పరిశీలించి నిందితుడిని ప్రత్యేక కోర్టుకు తరలిస్తామన్నారు.






