19 March, 2026 | 6:30 AM

19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్

19-03-2026 01:46 AM
  1. అయినా తట్టుకునే నెట్‌వర్క్ సిద్ధం
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): యాసంగి పంటల సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ర్టంలో విద్యుత్ డిమాండ్, వినియోగం గణనీయంగా పెరుగుతుందని, 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌నూ సమర్థంగా తట్టుకునే నెట్‌వర్క్ సిద్ధంగా ఉన్నదని, ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీసీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 

వేసవికాలం, యాసంగి సాగు సీజన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘గత సంవత్సరం మార్చి 20న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా, ఈ సంవత్సరం మార్చి 2న 17,606 మెగావాట్ల డిమాండ్‌ను చేరుకుని గత రికార్డును సమం చేసింది.

మార్చి 13న 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్ యూనిట్ల వినియోగంతో కొత్త రికార్డును సృష్టించింది’ అని వివరించారు. డిమాండ్ భారీగా పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఓవర్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు సమర్థంగా వ్యవహరించాయని పేర్కొన్నారు.   విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.

యాసంగి పంటల సీజన్ మరియు వేసవి కాలం ముగిసేంతవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ర్టంలోని అన్ని రంగాల వినియో గదారులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  నవీన్ మిట్టల్,  తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ  కృష్ణ భాస్కర్, తెలంగాణ డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, జితేష్ వి. పాటిల్, వరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.