19 March, 2026 | 3:19 AM

స్లోవేనియా పెట్టుబడులకు తెలంగాణ అద్భుత వేదిక

19-03-2026 01:46 AM
  1. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, ఐటీ రంగాల్లో మెరుగైన అవకాశాలు

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి) : ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఉన్న తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం శాసన సభ కమిటీ హాలులో తనను కలిసిన స్లోవేనియా ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమ య్యారు. మధ్య యూరప్ దేశమైన స్లోవేనియా యూరప్‌లోని సంపన్న దేశాలలో ఒకటి అని, భారత్‌లో ఆ దేశపు రాయబారి టోమజ్ మెన్సిన్ ఆధ్వర్యంలో విచ్చేసిన వాణిజ్య, పారిశ్రామిక బృందానికి శ్రీధర్ బాబు స్వాగతం పలుకుతూ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్,

ఐటీ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణా మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని వివరించారు. ఫార్మా, జీవ విజ్ణాన రంగాలు, వాహనాల విడిభాగాల ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. స్లోవేనియా ఆటో మొబైల్ దిగ్గజాలైన ఫోక్స్ వాగన్, కియా, హ్యుండాయ్, సిట్రోయెన్, స్టెల్లాంటిస్ బ్రాండ్ వాహనాలకు ఒరిజనల్ విడిభాగాలను అందిస్తోంది.

ఔషధ, బయోటెక్నాలజీ రంగాల్లో కూడా స్లోవేనియా గణనీయమైన ప్రగతి సాధించిందని, యూరప్ లోని ఔషధ, లైఫ్ సైన్సెస్ ఉత్పత్తుల్లో 14 శాతం అక్కడి నుంచి యూరప్ దేశాలకు సరఫరా అవుతున్న విషయం తెలిసిందేనని శ్రీధర్ బాబు ప్రశంసించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, తెలంగాణ పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, స్లోవేనియా ప్రతినిధులు ఆసిఫ్ ఇక్బాల్, సుజిత్ నాయర్, కీర్తి చిలుకూరి పాల్గొన్నారు.