ఏనుగు - కుక్క
రాజుగారి ఏనుగుల కొట్టంలోకి రోజూ ఒక కుక్క వస్తుండేది. ఏనుగు తినగా మిగిలింది ఆ కుక్క తింటుండేది. కుక్క గూడా ఒక పద్ధతిగా మెలిగేది. ఏనుగు తినేదాకా ఓపిగ్గా ఉండి, ఆ తర్వాతే మిగిలింది తినేది. ఏనుగు ఈ విషయం గమనించింది.
రోజులు గడుస్తున్న కొద్దీ, ఏనుగు కుక్క మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ ఒకేసారి పక్కపక్కనే తినేదాకా స్నేహం పెరిగింది. చివరకు ఆడి ఆడి అలసి ఏనుగు పక్కనే కుక్క పడుకునేది. ఏనుగుకి హుషారు ఎక్కువైనప్పుడల్లా కుక్క నడుమును తొండంతో చుట్టి గాలిలో తిప్పేది. ఉయ్యాల ఊపేది. వారిద్దరిలో ఏ ఒక్కరు పక్కన లేకున్నా మరొకరికి దిగులుగా ఉండేది.
ఏనుగుతో తిండి తిని తిని కుక్క కూడా గున్న ఏనుగులా బొద్దుగా పెరిగింది. ఒక రైతు కన్ను ఈ కుక్కమీద పడింది. ఆ రైతు ఏనుగును చూసుకునే మావటి వానితో కుక్క గురించి బేరాలాడాడు.
“నాకు ఆ కుక్క కావాలి. మంచి జాతి కుక్కలా ఉంది. ఎంతకి అమ్ముతావో చెబితే నీకు ఆ డబ్బు ఇస్తాను” అన్నాడు రైతు. మావటి వానికి ఏనుగు పని తప్ప మరో పనిగానీ బాధ్యతగానీ లేదు. ఎక్కడి నుంచో అనుకోకుండా వచ్చిన ఆ కుక్కని అమ్మితే అడిగేవాడే లేడు. పైగా మావటివానికి డబ్బు అవసరం కూడా పడింది. పెద్దగా బేరసారా లాడకుండానే డబ్బు తీసుకొని ఆ రైతుకు కుక్కని ఇచ్చేశాడు.
కుక్క లేకపోవడంతో ఏనుగు బెంగపడింది. తిండి తినడం దాదాపు మానేసింది. అది వరకు స్నానానికి నీళ్ళలోకి దిగితే ఏనుగు హుషారుగా ఉండేది. తొండంతో నలుదిక్కులా నీళ్లు చిమ్ముతూ అల్లరి చేసేది. ఇప్పుడది నీళ్ళలో దిగినా నిర్లిప్తంగా ఉంటోంది. దిగులుబడిపోయింది. అలా ఒకటి.. రెండు.. మూడు.. రోజులు గడిచిపోయాయి.
ఏనుగు మూలబడింది.
ఏనుగు వ్యవహారం రాజుగారితో వచ్చినప్పుడు హుషారుగా వున్న ఏనుగుని చూసిన వాడే. ఏదో అనుమానం వచ్చి మావటి వాడిని పిలిచి అడిగాడు. “ఏనుగు ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది. మరి ఎందుకింత దిగాలుగా మావటివానికి వళ్ళు చెమట్లు పట్టాయి. మంత్రికి జరిగిన విషయం చెప్పాడు. మన్నించమని వేడుకున్నాడు. కుక్కని తీసుకెళ్ళిన రైతు వివరాలు తనకు తెలియవన్నాడు. మంత్రి రాజుని కలిసి ఏనుగు కుక్క స్నేహం గురించీ, కుక్కని అమ్మిన మావటివాని గురించీ విన్నవించాడు. కుక్క తిరిగొస్తేనే ఏనుగు మళ్ళీ చలాకీగా ఉంటుందని కూడా మంత్రిగారు చెప్పారు.
రాజుగారు ఆ కుక్క ఎక్కడుందో తెలుసుకోవాలని తన రాజ్యమంతా చాటింపు వేయించాడు. కుక్క ఆచూకీ చెప్పినా, తెచ్చిచ్చినా నగదు బహుమతి ప్రకటించాడు. తీసుకెళ్ళిన ఆ రైతే కనుక తెచ్చిస్తే, డబ్బు వాపసుతో పాటు అదనపు బహుమతి కూడా ఇస్తామని చాటింపు వేసారు.
ఈ చాటింపు రైతు చెవిన పడింది. వెంటనే కుక్క గొలుసు విప్పి విడిచి పెట్టాడు. ఒక్క క్షణం కూడా ఆగక, ఆ కుక్క తన ప్రాంతానికి పరుగుదీసింది. తన మిత్రుడు ఏనుగుని చూసి ఎగిరిగంతేసింది.
కుక్కని చూస్తూనే ఏనుగు సంతోషం పట్టలేకపోయింది. తన తొండంతో కుక్క నడుముని చుట్టేసి గాలిలో తిప్పింది. తనపైన ఎక్కించుకుని అటిటూ తిరిగింది. తిరిగి నేలపైకి దింపింది. మావటివాడు ఆహారం తీసుకురాగానే, ఏనుగు దాన్ని కుక్క ముందుకు తోసింది. కుక్క సంతోషంగా తోక ఊపింది. చాలా రోజుల తర్వాత ఏనుగు మళ్ళీ కడుపునిండా ఆహారం తీసుకుంది.
ఈ వార్త రాజుగారికి తెలిసి చాలా సంతోషించారు. ఆపై ఏనుగు కుక్క ఏ చికాకులు లేకుండా సంతోషంగా కాలం గడిపాయి.
నీతి: పేద ధనిక తేడా చూడనిది స్నేహం.
బంధుత్వం కన్నా గొప్పది స్నేహం.
పిల్లల కోసం తరతరాల కథలు
పుస్తకం నుంచి..






