3 August, 2026 | 10:32 PM

పిల్లలకు పొదుపు పాఠాలు!

22-06-2024 01:00 AM

డబ్బు ఎలా పొదుపు చేయాలి? ఎలా ఖర్చు చేయాలి? ఈ విషయాలను చిన్న వయసులోనే నేర్పించాలి. పిల్లలకు డబ్బు విలువ తెలియకపోతే పెద్దయ్యాక ఇబ్బందులు పడతారు. పొదుపు చేయడం కూడా ఒకరకమైన సంపాదనే. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనీ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పాలి. అవసరాలకు, ఆశలకు చాలా తేడా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని పిల్లలకు వివరించాలి.

ఆర్థికపరమైన అంశాలను పిల్లలకు ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత మంచిది. ఐదారేండ్ల పిల్లలకు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ పాఠాలు చెప్పడం గొప్ప ఐడియా కాకపోవచ్చు. కానీ వారికి డబ్బు విలువను గుర్తించడం చెప్పగలిగితే వారికి అలవాట్లలో చాలా మార్పులు రావచ్చు. ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అలవాటు జీవితంలో ఎప్పటికైనా మేలే చేస్తుంది. 

పిల్లల్ని ప్రయోజకులను చేసేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వారి చదువుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అయితే చదువుతో పాటు పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం. పిల్లలు అన్ని విషయాలు చాలా వరకు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఆహారపు అలవాట్లు, మంచి చెడులే కాదు.. ఆర్థిక అలవాట్లు కూడా వారే నేర్పించాలి. అయితే వాటిని పాఠాలు చెప్పినట్లుగా కాకుండా రోజు వారీ పనుల్లో భాగంగా నేర్పిస్తే గుర్తుంటాయి. 

5-7 వయసులో..

పిల్లలకు రెండు కిడ్డీ బ్యాంకులను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఒకదానిపై పొదుపు అని, ఇంకోదానిపై ఖర్చు అని రాయండి. అకేషన్స్ అంటే బర్త్ డేకు పెద్దవాళ్లు ఇచ్చే డబ్బును వాటిలో వేయమని చెప్పండి. మొదటిది పెద్ద పెద్ద వస్తువులను కొనుగోలు చేయడానికి వాడుకోవాలని, రెండోది వాళ్లకిష్టమైన స్నాక్స్ వంటివి కొనుక్కోవడానికి అని చెప్పాలి. అలాగే ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ఎలా చేయాలో నేర్పించండి. 

7-13 వయసులో..

ఈ వయసులో ఆర్థిక నిర్ణయాల విషయంలో పిల్లల్ని పాలు పంచుకోనివ్వాలి. ఎలాగంటే ఒకే వస్తువు వేర్వేరు బ్రాండ్లలో తక్కువకు వచ్చేది ఏదో గమనించమని చెప్పలి. రోజూ మనం కొనే పాలు, గుడ్లు వంటి వాటిని కనీసం రూపాయి తగ్గేలా ఎలా పొందొచ్చు ఆలోచించమని చెప్పాలి. వీలైతే వారిని మార్కెట్‌కు తీసుకెళ్లి.. వాటి ధరల గురించి వివరించాలి. ఇంటిని శుభ్రం చేసినప్పుడు, కూరగాయలు తరిగినప్పుడు ఇలా ఏవైనా పనులు చేసినప్పుడు ప్రోత్సహకంగా కొంత డబ్బును ఇవ్వండి. ఇలా చేస్తే కష్టానికి ఇచ్చే డబ్బు విలువను తెలియపరుస్తుంది. డబ్బులు పరిమితమని, అపరిమితం కాదని తెలిసేలా చేయాలి.

ఎలాగంటే వారి చేతికి ఓ వంద ఇచ్చి సూపర్ మార్కెట్లో దానితో నీకిష్టమైనవి కొనుక్కోమని చెప్పాలి. ఆ వందలోనే ఏవి కొనాలి? ఎంత మిగుల్చుకోవాలో? తెలుసుకునేలా చేయాలి. ఏదైనా కొనడానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు మనం అడిగే ప్రశ్నలను విని వారూ అనుసరించేలా చూడాలి. నిజంగా ఈ వస్తువు అవసరమా? దీన్ని కొనాలా? మరో చోట ఇది తక్కువకు లభిస్తుందా? రెండు కొంటే ఒకటి ఫ్రీగా వస్తుందా? వేరే బ్రాండ్లపై ఆఫర్లు ఉన్నాయా? వంటి వాటిని పిల్లల ముందు తల్లిదండ్రులు చర్చిస్తూ ఉండాలి. ఇది పిల్లలకు కూడా అటోమేటిక్‌గా అలవాటు అవుతుంది. 

14-18 వయసులో..

ఈ వయసు వారికి ఎలాగూ స్కూల్లో మ్యాథ్స్ పాఠాలు నేర్పుతారు. వాటిని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో తెలియజేయాలి. చిన్న వయసులో పొదుపు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయం డి. చిన్న వయసు నుంచే వారికి తమ చదువుకు ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పండి. మన ఆర్థిక వనరులు, ఇంటి పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పాలి. మంచి ర్యాంకు తెచ్చుకుం టే డబ్బుతో సంబంధం లేకుండా ఉచిత సీట్లు పొందే అంశాలనూ పిల్లలకు తెలియజేయాలి. విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌ల వం టి వాటి గురించి అవగాహన కల్పించండి. 

18-21 వయసులో..

ఈ వయసు వారికి మనం చెప్పడానికి ఏమీ ఉండదు. పైన చెప్పినట్లు చేసుకుంటూ వస్తే ఈ వయసుకల్లా వారు తమ కాళ్లపై తాము నిలబడే ఉంటారు. లేదంటే సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తెచ్చుకునే ఉంటారు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, క్రెడి ట్ కార్డుల వినియోగం ఈ వయసులోనే చెప్పాలి. ఇంకా వీలుంటే డీమ్యాట్ ఖాతాలనూ తెరిపించి మ్యూచువల్ ఫండ్‌లలో సిప్ చేయించవచ్చు. నెలకు కనీస మొత్తాన్ని వారితోనే అందులో పెట్టించవచ్చు. ఉద్యో గం చేయాలా? లేదంటే బిజినెస్ పెట్టాలా ? అన్నదాన్ని వారి ఇష్టానికే వదిలేయాలి. 

రోల్ మోడల్‌గా ఉండాలి

పిగ్గీ బ్యాంక్ కొనిచ్చి అందులో డబ్బు దాచుకునేలా ప్రోత్సహించాలి. మోనోపోలి వంటి మనీ గేమ్‌లను ఆడేలా పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లలకు కొంత డబ్బు ఇచ్చి పండ్లు, కూరగాయలు కొనడం అలవాటు చేయాలి. డబ్బు నిర్వహణ గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. మనీ మేనేజ్‌మెంట్‌లో తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండాలి. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి.ఇలా చేయడం వల్ల హార్డ్ వర్క్ ప్రాముఖ్యత పిల్లలకు తెలుస్తుంది. 

ముఖ్యమైన అంశాలు

  1. పిల్లలు అడిగిన వెంటనే ఏదైనా కొనిచ్చే అలవాటును మానుకోవాలి.
  2. కిడ్డీ బ్యాంకులో డబ్బులు దాచుకోవడం నేర్పించాలి.
  3. దాచుకున్న డబ్బు నుంచి వారికి ఇష్టమైన స్టోరీ బుక్స్, ఆడుకునే వస్తువులు ఇప్పించాలి. 
  4.  పొదుపు, ఖర్చుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి.