17 July, 2026 | 1:29 AM

ఎల్లుండి పీఎం కిసాన్ డబ్బులు

16-06-2024 12:25 AM
  • రైతుల ఖాతాల్లో వేయనున్న కేంద్రం
  • ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 వేలు
  • కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 15: పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఏడాది రైతులకు పెట్టుబడి సాయం మొదటి నిధులను విడుదల చేసే తేదీని కేంద్ర వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. 18వ తేదీన లబ్ధిదారులైన ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో మొదటి విడుత నిధులు రూ.2000 జమచేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం వెల్లడించారు. ‘మోదీ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్‌పైనే చేశారు’ అని చౌహాన్ గుర్తుచేశారు.

పథకం ప్రారంభించినప్పటి నుంచి రైతుల ఖాతాల్లో రూ.3.04 లక్షల కోట్లు జమచేసినట్టు వివరించారు. 2018 నుంచి పీఎం కిసాన్ పథకాన్ని అమలుచేస్తున్నారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో ఏడాదికి మూడు విడుతల్లో రూ.6000లను పెట్టుబడి సాయంగా వేస్తున్నారు. ఏటా 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్లు అందిస్తున్నారు. 

ఎలా చూసుకోవాలి?

తమకు పీఎం కిసాన్ నిధులు వచ్చాయో లేదో చెక్ చేసుకొనేందుకు రైతులు pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్ పీజీపై క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యే పేజీలో నిర్ణీత ప్రదేశంలో ఆధార్ నంబర్ లేదా బ్యాంకు అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డాటా బటన్‌పై క్లిక్ చేస్తే మీకు డబ్బులు వచ్చిందీ లేనిది తెలిసిపోతుంది. కేవైసీ చేయని రైతులకు పీఎం కిసాన్ నిధులు రావు. అందువల్ల అదే వెబ్‌సైట్‌లో కేవైసీ చేకోవాలి.