జపాన్‌లో మాంసం తినే బ్యాక్టీరియా
- 48 గంటల్లో మనిషిని చంపేసే శక్తి
- వేగంగా విస్తరిస్తున్న కొత్త ముప్పు
టోక్యో, జూన్ 15: ప్రపంచానికి మరో ముప్పు ముంచుకొస్తున్నది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటుండగా అంతకంటే ప్రమాదకరమైన వ్యాధి తరుముకొస్తు న్నది. శరీరంలోకి చొరబడి మాంసాన్ని తినేసే ప్రమాదకర బ్యాక్టీరియా జపాన్‌లో వేగంగా విస్తరిస్తున్నది. ఈ బ్యాక్టీరియా సోకితే 48 గంటల్లో మనిషి చనిపోతాడని వైద్యులు తెలిపారు. స్ట్రెప్టోకొక్కోల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (ఎస్‌టీఎస్‌ఎస్)గా పిలుస్తున్న ఈ కేసులు ఈ ఏడాది జపాన్‌లో ఇప్పటికే 977కు చేరాయి. గత ఏడాది మొత్తంలో ఇలాంటి కేసులు 941 మాత్రమే నమోదయ్యాయి. ఈ బ్యాక్టీరియాను 1999లోనే గుర్తించినప్పటికీ ఈ మధ్య దీని విస్తరణ అత్యంత వేగంగా ఉన్నదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్సియస్ డిసీజెస్ ప్రకటించింది.
ఈ వ్యాధి సోకితే మొదట గొంతు పొడిబారటం, శరీర భాగాల్లో వాపు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో దీనిని స్ట్రెప్ త్రోట్ అని పిలుస్తారు. కొందరిలో ఒళ్లు నొప్పులు, వాపు, జ్వరం, రక్తపోటు తగ్గిపోవటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ‘ఈ వ్యాధి మరణాల్లో అత్యధికం బ్యాక్టీరియా సోకిన 48 గంటల్లోనే సంభవిస్తున్నాయి’ అని టోక్యో మహిళా మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కెన్ కికుచి తెలిపారు.






