17 July, 2026 | 1:12 AM

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు

16-06-2024 12:26 AM

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 

న్యూఢిల్లీ, జూన్ 15 : ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. అయితే, తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. బెంగళూరులో ఆయన నమీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు పొరపాటున జరిగిందని, మోదీకి ఇదే చివరి అవకాశమని, మళ్లీ ఆయన ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం లేదని జోస్యం చెప్పారు. ఇది మైనార్టీ ప్రభుత్వమని ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందని గుర్తు చేశారు.

దేశ ప్రజలకు మంచి జరగడం కోసం తాము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దేశాన్ని పటిష్ఠం చేయడానికి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఇండియా కూటమి నేతలకు వివరించారు. దేశానికి మంచి జరగనివ్వకుండా చేయడం ప్రధాని మోదీకి అలవాటేనని విమర్శించారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటుందన్నారు. 

గణనీయంగా పుంజుకున్న కాంగ్రెస్..

ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలో బీజేపీ 240 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి కాస్త దూరంగా ఉండిపోయింది. చంద్రబాబునాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, ఏక్‌నాథ్ షిండే వంటి భాగస్వాములతో కలిసి మెజార్టీ మార్క్ (272)ను దాటింది. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. మరోవైపు, 2019లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి గణనీయంగా పుంజుకుంది. ఈ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకొని తన బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుని లోక్‌సభలో బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.