calender_icon.png 5 December, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్‌క్యూర్ ఫార్మా ప్రీమియం లిస్టింగ్

11-07-2024 02:08:17 AM

ముంబై, జూలై 10: గతవారం జారీచేసిన ఐపీవీకు భారీ స్పందన అందుకున్న ఎమ్‌క్యూర్ ఫార్మా బుధవారం 31 శాతం ప్రీమి యంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,008 కాగా, ఈ షేరు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో 31.45 శాతం అధికంగా రూ.1,325 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. చివరకు బీఎస్‌ఈలో 34.85 శాతం లాభంతో రూ.1,358 వద్ద ముగియగా, రూ. 1,364 ధర వద్ద ఎన్‌ఎస్‌ఈలో క్లోజయ్యింది. ఈ ధరపై కంపెనీ మార్కెట్ విలువ రూ.25,695 కోట్లుగా నమోదయ్యింది.

రూ.1,952 కోట్ల సేకరణకు ఎమ్‌క్యూర్ ఫార్మా జారీచేసిన ఐపీవో 68 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఈ ఆఫర్‌కు సంస్థాగత ఇన్వెస్టర్లు 195 రెట్లు అధికంగా బిడ్ చేయగా, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల నుంచి 48.32 రెట్లు బిడ్స్ లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకుగాను 7.21 రెట్లు బిడ్డింగ్ జరిగింది.  ఐపీవో ద్వారా  కంపెనీ రూ.800 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీచేయగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ. 1,152 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)గా విక్రయించారు. 

ఇదేబాటలో భన్సాల్ వైర్

గతవారం ఐపీవోకు వచ్చిన భన్సాల్ వైర్ కూడా ఎమ్‌క్యూర్‌బాటలోనే భారీ ప్రీమియంతో బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యింది. స్టీల్ వైర్లు తయారుచేసే ఈ కంపెనీ ఆఫర్ ధర రూ.256తో పోలిస్తే 39 శాతం ప్రీమియంతో రూ.354 ధరతో ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్ ప్రారంభించింది. చివరకు భన్సాల్ వైర్ షేరు 36.80 శాతం లాభంతో రూ. 350 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ. 5,484 కోట్లుగా నమోదయ్యింది.  భన్సాల్ వైర్ ఐపీవో  60 రెట్లు బిడ్స్‌ను అందుకున్నది. రూ. 745 కోట్ల సమీకరణ కోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లనే కంపెనీ జారీచేసింది.  సంస్థాగత ఇన్వెస్టర్ల కోటా 146 రెట్లు, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల విభాగం 51 రెట్లు, రిటైల్ విభాగం 13.64 రెట్లు చొప్పున ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది.