ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మచ్చ!
- నిప్పులు చెరిగిన బీజేపీ శ్రేణులు
- రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
- రాహుల్‌గాంధీ, మలికార్జున ఖర్గేపై విమర్శలు
- వ్యతిరేక దినంగా కాషాయదళాలు పాటింపు
- ఎమర్జెన్సీలో జైలుకెళ్లిన వారికి సన్మానాలు
విజయక్రాంతి నెట్‌వర్క్, జూన్ 25 : అర్ధ శతాబ్దం కింద దేశంలో అత్యవసర పరిస్థితులపై బీజేపీ నిరసనలు వెళ్లగక్కింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆందోళనలకు దిగింది. జూన్ 25ను ఎమర్జెన్సీ వ్యతిరేకంగా దినంగా పాటించి, కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టింది. అరాచకమైన పాలనకు కాంగ్రెస్ కేరాఫ్‌గా నిలుస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం లో ఎమర్జెన్సీ రోజుల్లో జైలుకెళ్లిన వారిని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్ సన్మానించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కే లేదని, రాజ్యాంగంపై రాహుల్‌గాంధీ, ఖర్గే మాటలు దెయ్యాలు వేదం వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నియంతృత్వం, నిరంకుశత్వం చీకటి రోజులు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పాల్గొని అధికార దాహంతో ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని మండిపడ్డారు. మంచిర్యాలలో అర్చన టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్కు వరకు మౌన ప్రదర్శన, మౌన దీక్ష చేపట్టారు.
అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడారు. 1975, జూన్ 25 నాటి పరిస్థితులు చాలా బాధాకరమన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మేధావులు, ఉద్యమ కారులను నిర్మల్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజికు మార్‌రెడ్డి, నాయకులు అయ్యన్నగారి భూమ య్య, రావుల రాంనాథ్, విజయకుమార్, ప్రవీణ్‌శర్మ సన్మానించారు. కామారెడ్డిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్, ప్రధాన కార్యద-ర్శులు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు, నల్లక్లాత్‌తో నిరసన వ్యక్తం చేశారు.
ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపిన పర్వతం లక్ష్మమ్మ, యాస ముత్తారెడ్డి, మల్గిరెడ్డి రాఘవరెడ్డి, కర్నాటి కిషన్, నాగవెల్లి బ్రహ్మయ్య, దశరధ, సోమయ్యను సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర ఉపా-ధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు, గొంగిడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఎమర్జెన్సీలో జైలు శిక్షను అనుభవించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏడుగురిని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ తల్లోజీ ఆచారి సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, నాగొల్ల లక్ష్మీనారాయణ, దొందుల రవి, స్వామి యాదవ్, భరత్ భూషన్, ఇప్పకాయల కిశోర్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ అధ్యక్షతన ఎమర్జెన్సీ వ్యతిరేక సభ నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రాష్ట్రనాయకుడు దాసరి మల్లేశం తదితరులు పాల్గొని కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. మెదక్‌లో నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో బ్లాక్‌డే పాటించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడ గడ్డం శ్రీనివాస్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, రాష్ట్ర నాయకుడు రాగి రాములు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అరాచకాలకు ఎమర్జెన్సీ నిదర్శనం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, జూన్ 25 : కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ ఓ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు 99 సార్లు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఏబీవీపీ, జనసంఫ్‌ు కార్యకర్తలతోపాటు సంఫ్‌ుపరివార్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని పేర్కొన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో రాహుల్ గాంధీ తన నానమ్మ ఇందిరను మించిపోయారని ఆరోపించారు. ఇందిర ఎమర్జెన్సీ విధిస్తే, అధికారం కోసం ఆయన మనవడు రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పర్యటిస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాహుల్‌గాంధీ యత్నించారని విమర్శించారు.






