ఖరీఫ్‌కు రైతు భరోసా అందించాలి
రైతుల రుణాల వివరాలు బయటపెట్టాలి
ప్రభుత్వానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులకు వానకాలం పంటకు రైతు భరోసా అందివ్వాలని, ఎకరానికి రూ.7,500 ఖాతాల్లో జమ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు గడుస్తున్న సీఎం, మంత్రులకు రైతుభరోసా అందించే సమయంలేదని, రుణమాఫీ అమలు చేస్తారో లేదో చెప్పాలన్నారు. 5 ఎకరాలలోపు రైతులకు ఏ బ్యాంక్ రూ.2 లక్షల రుణం ఇవ్వలేదు. 5 ఎకరాల లోపు రైతులకు ఎంతమందికి రూ.2 లక్షలు రుణం ఇచ్చారో, తీసుకున్నవారి వివరాలు వెల్లడించాలన్నారు.
కౌలుదార్లకు, రైతు కూలీలకు పెట్టుబడి సాయం ఇస్తారా? లేదా? సమాధానం చెప్పాలన్నారు. అధికారం చేపట్టిన సమయంలో రేషన్‌కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు అందరికీ కొత్తకార్డులు ఇస్తామంటున్నారు. నిబంధనల పేరుతో రేషన్‌కార్డులు కట్ చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి క్యాబినేట్ ఆమోదించినందుకే సంబురాల చేస్తున్నారని, సినిమా పరిశ్రమతో స్నేహంతో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రమోషన్ చేసుకుంటున్నారు. రుణమాఫీ చేసినట్లు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ పాలనలో ఈ విధంగా చేస్తే మీడియా సంస్థలు గగ్గోలు పెట్టేవని, ఆయా సంస్థలు ఇప్పుడే ఏం చేస్తున్నాయని నిలదీశారు. రేవంత్‌రెడ్డి రుణమాఫీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న చేస్తామన్నారని, ఇప్పుడు మాట మార్చి ఆగస్టు 15కు వాయిదా వేశారని విమర్శించారు. మొదట రుణమాఫీకి రూ.40వేలు కోట్లు కావాలని చెప్పి, క్యాబినెట్ భేటీ తరువాత రూ.30 వేల కోట్లే అంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు ప్రోత్సహాకాలు ఇస్తామని చెప్పారని, కానీ జరగలేదన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టి నేటికి 50 ఏళ్లు అవుతుందని గుర్తుచేశారు.






