ఇప్పుడు రాళ్లతో తరిమికొట్టేది ఎవరు?
- పార్టీ మార్పులపై రేవంత్ ప్లేట్ ఫిరాయింపు
- ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి చేస్తూనే ఉంది
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో నీతులు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఎక్స్ వేదిక స్పందిస్తూ ఒక పార్టీ తరుఫున గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే ఊళ్ల నుంచి తరిమికొట్టమన్నారని తెలిపారు. ఇప్పుడు స్వయంగా రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే కదా అని ప్రశ్నించారు. అందుకే జవాబు చెప్పాల్సింది కూడా రేవంత్‌రెడ్డినేనని పేర్కొన్నారు.
నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్
ఒక వైపు రాజ్యాంగ పరిరక్షణ అని పేర్కొంటూ మరోవైపు పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటివరకు నయవంచనకు ఆ పార్టీ ప్రతిరూపమన్నారు. పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణిచి వేస్తూ 49 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందన్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామంపై కాంగ్రెస్ అదే దాడి చేస్తుందన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ పార్లమెంటులో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకుని ప్రదర్శన చేశారని విమర్శించారు. మరోవైపు అదే పార్లమెంటుకు కొద్దిదూరంలో ఉన్న వారి పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందన్నారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతారో దాని స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు.






