12-08-2025 12:00:00 AM
(నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం) :
* ఏడున్నర దశబ్దాల ప్రణాళిక, ప్రగతి, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతి సాధించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దేశంలో అమలైన పారిశ్రామిక విధానం, పెట్టుబడి విధానం, ఆర్థిక విధానం.. ఉపాధి రహిత అభివృద్ధిని పెంచింది.
యువత దేశ భవిత. దేశ పురోగతి యువతపై ఆధారపడి ఉంటుంది. యువ శక్తిని మించిన శక్తి ఈ భూమండలం మీద ఏదీ లేదనేది వాస్తవం. దేశాభివృద్ధి పురోగతిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. అయితే యువతలో నైపుణ్యాలు కొరవడి కోటి ఆశలతో ఉపాధి వేటకు సిద్ధమవుతున్న యువశక్తి తీవ్ర భంగపాటుకు గురై నిరాశ నిస్పృహల్లో కూరకుపోతున్నారని ఉపాధి రహితవృద్ధిని ఆక్షేపిస్తూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తన తాజా నివేదికలో వెల్లడించడం దేశంలో యువశక్తి నిర్వీర్యతకు నిదర్శనం. నేడు (ఆగస్టు 12) అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కథనం.
పెరిగిపోతున్న నిరుద్యోగం
ఏడున్నర దశబ్దాల ప్రణాళిక, ప్రగతి, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతి సాధించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దేశంలో అమలైన పారిశ్రామిక విధానం, పెట్టుబడి విధానం, ఆర్థిక విధానం, ఉపాధి రహిత అభివృద్ధిని పెంచింది. దేశంలో 2000 సంవత్సరంలో యువతలో 5.7 శాతం వున్న నిరుద్యోగిత 2022 నాటికి 12.1 శాతానికి పెరిగింది.
మరో వైపు దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో జనాభాలో యువత శాతం తగ్గుతుందని ఐఎల్‌వో ఒక నివేదికలో పేర్కొంది. విద్యావంతులైన యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్తులో శ్రామిక మార్కెట్‌లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి.
మార్కెట్‌లో డిమాండ్‌కు అనుకూలంగా యువ కార్మిక బలం అందుబాటులో ఉండదని ‘ప్రపంచ కార్మిక సమాఖ్య’, ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్’ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో భారత ఉపాధి నివేదిక-2024’ వివరాలు వెల్లడించింది.
నిరుద్యోగంలో మగ్గుతున్న తెలంగాణ
నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణలో.. ప్రభుత్వం నియామకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో 15- ఏళ్ల వయసులో వున్న చదువుకున్న యువత 77.7 శాతం ఉన్నప్పటికీ వారికి సరిపడే ఉద్యోగాలు మాత్రం లేవు. చాలా మంది యువత ఉపాధికి దూరంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలంగాణలో 15- ఏళ్ల వయసులో 30 శాతం యువతులు, 18 శాతం యువకులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగి రేటు 14.19 శాతం నుంచి 21.71 శాతానికి పెరిగింది. మహిళా కార్మిక బలం వాటా తక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. యువకుల్లో నిరుద్యోగిత రేటు 12.96 శాతం నుంచి 18.34 శాతానికి చేరితే.. యువతుల్లో ఏకంగా 17.65 శాతం నుంచి 30.35 శాతానికి పెరిగిందని నివేదికలో పేర్కొంది. 2005లో పురుషుల ఉపాధి కల్పనలో 11 వ స్థానంలో ఉన్న తెలంగాణ 2022 నాటికి 2వ స్థానానికి చేరింది.
మహిళా ఉపాధి సుచిలో 4వ స్థానం నుండి 7 వ స్థానానికి పడిపోయింది. ఉపాధి ‘విద్య’ శిక్షణకు దూరంగా ఉంటున్న యువత సంఖ్య 2005లో 17.9 శాతం ఉంటే ప్రస్తుతం 27.54 శాతానికి పెరిగింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో యువ జనాభాలో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఉత్తర భారతంలో కూడా యువ జనాభా తగ్గుముఖం పట్టే పరిస్థితిలో వుందని అధ్యయనంలో తేలింది.
నైపుణ్యలోపమే అసలు సమస్య
యువతలో కంప్యూటర్ నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి. బేసిక్ అంశాల మీద కనీస అవగాహన లేదు. పనిచేస్తూ చదువుకోవడం.. కోర్స్ పూర్తయ్యే నాటికి నూతన నైపుణ్యాలను ఒంటపట్టించుకొని ఉద్యోగ అర్హత సంపాదించడం అభివృధ్ది చెందిన దేశాల్లో సహజం. భారత్‌లో మాత్రం సొంత కాళ్ల మీద నిలబెట్టే నైపుణ్యాలు మన దేశ విద్యార్థులకు ఏమాత్రం అబ్బడం లేదు.
ఏటా కోటి 20 లక్షల పట్టభద్రులుగా బయటకొస్తున్నప్పటికీ ఉద్యోగం పొందే విషయంలో మాత్రం ఇది మూడో వంతుకే పరిమితం అవుతుందని నివేదిక తెలిపింది. దేశంలో రాబోయే 30 సంవత్సరాల్లో రంగాల వారీగా దేశ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి, ఉపాధి అవకాశాలను మదింపు చేసి అందుకు తగ్గట్లు వృత్తి విద్యా కోర్సులను సంస్కరించాల్సిన అవసరముంది.
నైపుణ్య కేంద్రాల ఏర్పాటు అవసరం
కృత్రిమ మేధస్సు (ఏఐ), రొబోటిక్స్, డేటా సైన్స్ లాంటి సాంకేతిక కోర్సులకు పటిష్టమైన పునాది అవసరం. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచాలి. ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను విస్తరించాలి. గ్రామీణ చేతి వృత్తులు ఆధునీకీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వాలి. నూతన పాఠ్యాంశాలు ప్రవేశ పెట్టాలి.
విద్యా సంస్థల్లో నైపుణ్య అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల ఆసక్తిని గుర్తించి వారికి ఇష్టమున్న కోర్సు అభ్యసించే విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. బోధన, అధ్యయనం, పరిశోధన ప్రక్రియలను మరింత బలోపేతం చేయాలి. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలి.
మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే విద్య, వైద్య రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది. యువత నైపుణ్యాలు పెంచుకొని ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి అవకాశాలను ఒడిసి పటేల్టా విద్యా ప్రణాళికల కార్యాచరణకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరముంది.
నేదునూరి కనకయ్య
వ్యాసకర్త సెల్: 9440245771