calender_icon.png 12 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాస్కా దిశగా!

12-08-2025 12:00:00 AM

వచ్చే శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో జరగనున్న సమావేశం ఉత్కంఠ గా మారింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం పరిసమాప్తికి ఉద్దేశించిన ఈ సమావేశం ఫలితం ఎలా ఉండబోతున్నదనేది ఒక అంశమైతే, భారత్ సహా మరికొన్ని దేశాలపై ట్రంప్ సుంకాల బాదుడుకు కొంతైనా ఉపశమనం లభిస్తుందా అనేది రెండో అంశం.

రష్యా-ఉక్రెయిన్ మధ్య 40 నెలలుగా జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం నెరపుతున్న ట్రంప్ ఇప్పటిదాకా సఫలీకృతుడు కాలేకపోయారు. ఆయన పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రతిసారి యుద్ధం అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తూనే వస్తున్నది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలు కూడా పుతిన్‌ను కాల్పుల విరమణ వైపు తీసుకురాలేకపోయాయి.

2014లో రెఫరెండం ద్వారా క్రిమియా రష్యాలో అంతర్భాగమేనని ప్రకటించిన పుతిన్ , ఇప్పుడు శాంతి చర్చల్లో మరోసారి దానిని ప్రధానాంశం చేశారు. క్రిమియా రష్యాలో అంతర్భాగమేనని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఆ విషయం తెలుసనని తాజాగా ట్రంప్ కూడా చెప్పడం ఉక్రెయిన్‌కు అశనిపాతంగా మారింది. ఆగస్టు 15న అలాస్కా చర్చల్లో భాగంగా ట్రంప్ తన శాంతి ఒప్పందానికి క్రిమియానే ప్రధాన ఆటంకంగా మారిందని భావిస్తే, పుతిన్ క్రిమియాపైనే పట్టుబడితే జెలెన్‌స్కీకి మరోమార్గం ఉండకపోవచ్చు.

ట్రంప్ కుదిర్చే ఒప్పందాన్ని కాదని భవిష్యత్‌ను చూడలేని పరిస్థితులు జెలెన్‌స్కీకి ఎదురయ్యాయి. అమెరికా మిలిటరీ సాయం లేకుండా, ఐరోపా దేశాల మద్దతు దూరమై రష్యాతో యుద్ధం కొనసాగించడం అసాధ్యమనే విషయం జెలెన్‌స్కీని కలవరపెడుతున్నది. యుద్ధంలో వేలాది మందిని కోల్పోయిన ఉక్రెయిన్, ఆర్థికంగా బాగా చితికిపోయింది. 

2008 నాటి జీడీపీకి కుంచించుకుపోయిన దేశ ఆర్థిక పరిస్థితి యూరప్ దేశాలన్నింటితో పోలిస్తే పాతాళానికి పడిపోయింది. మళ్లీ పశ్చిమ దేశాల మద్దతుతో దేశాన్ని ప్రగతి బాటన నడిపించాలంటే, రష్యా దాడుల నుంచి దేశాన్ని రక్షించుకోవడమొక్కటే మార్గంగా ఉంది. కనుక అలాస్కా శాంతి చర్చల్లో ట్రంప్ చేదు మాత్ర మింగమన్నా దానికి జెలెన్ స్కీ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.

నిజానికి, రష్యా షరతులన్నింటికి ఆమోదం తెలిపేలా ట్రంప్ శాంతి ఒప్పందం ఉండవచ్చు. యుద్ధం పరిసమాప్తి చేసి, పెద్దరికాన్ని నిలుపుకోవాలని ట్రంప్ తాపత్రయపడుతున్నారు. టారిఫ్‌ల కొరడా ఝులిపించి ప్రపంచ ఆర్థిక రంగాన్ని అస్థిపరిచిన ట్రంప్, ఇప్పుడు శాంతి కాముకునిగా నోబెల్ శాంతి బహుమతి లక్ష్యంగా కొంత శాంతిస్తారా అనేది కూడా అలాస్కా చర్చల్లో తేలనుంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ కాల్పుల విరమణలో తన పాత్ర ఉందని ఎన్నిసార్లు చెప్పుకున్నా, భారత్ దానిని అంగీకరించకపోవడం ట్రంప్‌కు నిరాశ కలిగించింది. భారత్‌పై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. భారత్‌ది ‘డెడ్ ఎకానమీ’ అని, అమెరికాతో భారత్‌కు మంచి వాణిజ్య మితృత్వం లేదని ట్రంప్ తన అక్కసునంతా వెళ్లగక్కారు.

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నదనే సాకుతో సుంకాలను రెండింతలు చేశారు. అయినా భారత్ తన సంద్గమమనాన్ని కోల్పోకుండా, అమెరికా విధించిన షరతులు కాదని, వాణిజ్య ఒప్పందాన్ని కాదని.. రష్యా, చైనా వైపు నిలిచింది. ఈ పరిస్థితుల్లో సామరస్య పూర్వకంగా అలాస్కా సమావేశం తర్వాతనైనా ట్రంప్ తన టారిఫ్ బాదుడుపై పునరాలోచన చేస్తారని అంతా భావిస్తున్నారు.