14-01-2026 08:49:53 PM
చిట్యాల,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీజేజీఈజీఎ)ను ఎలాంటి మార్పులు లేకుండా యధాతధంగా కొనసాగించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, వృత్తి దారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రంలో బుధవారం బోగి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుక వచ్చిన వీబీజీ రామ్ జీ, నాలుగు లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ ల చట్టం బిల్లు ప్రతులను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పదకొండు సంవత్సరాల మోదీ పాలనలో రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురైనాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం మోడీ సర్కారు విధానం అని అన్నారు. ఈ నెల 19 న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనునున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా, బొబ్బిలి సుధాకర్ రెడ్డి,ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, సీపీఎం మండల నాయకులు శీలా రాజయ్య, జిట్ట స్వామి, మేడి సుగుణమ్మ, సీఐటీయూ నాయకులు ఏళ్ల మారయ్య, గోధుమగడ్డ మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, జిట్ట సురేష్, దినేష్, అంజయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.