22 May, 2026 | 2:39 AM

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి

22-05-2026 12:40 AM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

తంగళ్ళపల్లి మే 21( విజయ క్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఊర చెరువులో జల సంచాయ్ - జన్ భాగిదారి కార్యక్రమం కింద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ప్రతి రోజు కనీసం 150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిరక్షరాస్య కూలీలు ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకోవాలని ప్రోత్సహించారు.

రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు సన్న వడ్లు సాగు చేయాలని సూచించారు.అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైస్ మిల్లులకు తరలింపు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అవసరమైన వాహనాలు సమకూర్చాలని సూచించారు.ఈ పరిశీలనలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీసీఎస్‌ఓ బుచ్చిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సహకార అధికారి రామకృష్ణ, తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఎంపీడీఓ రమేష్, ఇంచార్జి తహసీల్దార్ మురళి తదితరులు పాల్గొన్నారు.