8 కోట్ల మంది ఉపాధి ఉఫ్!
రెండేళ్లలో ఉపాధి కూలీలకు కేంద్రం ఉద్వాసన
పౌర సంఘాల నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నదని పలు సర్వేలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో ఈ పథకం నుంచి 8 కోట్ల మందికి పైగా కార్మికులను తొలగించినట్లు పౌరసమాజ సంఘాలు, లిబ్‌టెక్ ఇండియా, ఎన్‌ఆర్‌ఈ సంఘర్ష మోర్చాల నివేదికలు వెల్లడిస్తున్నాయి. 202223 ఆర్థిక సంవత్సరంలో స్కీమ్‌లోని మొత్తం నమోదిత కార్మికుల సంఖ్యలో 20.47 శాతం మందిని తొలగించారని, గడిచిన ఐదేళ్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నాయి.
ఆధార్ ఆధారిత చెల్లింపు( ఏబిపిఎస్) వంటి సాంకేతికత కేంద్రీకృత విధానాలు.. ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయని లిబ్‌టెక్ ఇండియా పరిశోధకులు చెబుతున్నారు. అధికారులకు శిక్షణ ఇవ్వకుండా కొత్త సాంకేతికతను అమలు చేశారని, ఏబీపీఎస్ కోసం అధికారులకు లక్ష్యాలు పెట్టారని, గత రెండు సంవత్సరాల్లో 8 కోట్ల కార్మికులు తొలగింపునకు ఇది కారణమని పేర్కొంది. కేంద్ర బడ్జెట్‌లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ పథకానికి నిధుల్లో కోత పెడుతున్నారని తెలిపింది.అంతే కాకుండా వేతనాల చెల్లింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొంది.
కార్మికులు తొలగింపు వివరాలు
సంవత్సరం తొలగింపు కొత్తగా చేరిన
వారి సంఖ్య
2019-20 1.83 శాతం -
2022-23 20.47శాతం 4.24 శాతం
2023-24 9.87 శాతం 4.18 శాతం






