కమిషన్‌ను తప్పు పట్టడం సరికాదు
- విద్యుత్ విచారణపై కేసీఆర్ తీరును ఎండగట్టిన బీజేఎల్పీ
సీబీఐ దర్యాప్తు చేయించాలని సర్కారుకు ఏలేటి సవాల్
మెదక్ ఘటనపై ప్రభుత్వ తీరు పట్ల విమర్శలు
హైదారాబాద్, జూన్ 16, (విజయ క్రాంతి): విద్యుత్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కాకుండా, కమిషన్‌కు విచారణార్హత లేదంటూ మాజీ సీఎం కేసీఆర్ విమర్శించడాన్ని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల ఏర్పా టుపై సందేహాలకు కేసీఆర్ కమిషన్ ఎదుట వివరణ ఇచ్చి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేదని, కానీ.. కమిషన్‌నే విమర్శిస్తూ లేఖ రాయడం విచారణ వ్యవస్థలను అగౌరవపరచడమేనని పేర్కొన్నారు.
పదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన కేసిఆర్ తీరు అప్రజాస్వామికమని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసలు తన పాలనలో విద్యుత్ రంగంలో తప్పులే జరగకపోతే విచారణకు హాజరు కావడానికి కేసీఆర్‌కు భయమెం దుకని ప్రశ్నించారు. విచారణ కమిషన్ పట్ల కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై సీబీఐ విచారణతో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నా రాష్ర్ట ప్రభుత్వం కమిషన్ ఎందుకు వేసిందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలంటే రాష్ర్ట ప్రభుత్వం సీబీఐ విచారణ కోరి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
ఇక ఈ విషయంలో విద్యు త్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వాఖ్యలు సరికావని విమర్శించారు. కమిషన్, విచారణ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మెదక్ ఘటనలో రాష్ర్ట ప్రభుత్వం, అధికారులు, పోలీసుల తీరు సరికాదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను, మమ్మల్ని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






