calender_icon.png 14 November, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైసల్ కొట్టు.. అనుమతి పట్టు

29-07-2024 01:24:47 AM

సూర్యాపేట మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో పెచ్చుమీరుతున్న అవినీతి

అంతా తానై చూసుకుంటున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి

నిర్మాణాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్న వైనం

సూర్యాపేట, జూలై 28(విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి పెచ్చుమీరుతోంది. పట్టణంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, వెంచర్లు.. టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసుల పంట పండిస్తున్నాయి. అనుమతిలేని నిర్మాణమైనా అధికారుల చేతులు తడిపితే సరిపోతుందనే ఉద్దేశంలో నిర్మాణదారులున్నారు. వాస్తవానికి సూర్యాపేట మున్సిపాటిలీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాజ్యం నడుస్తోంది.

టౌన్ ప్లానింగ్ విభాగంలో వీరి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు లెక్కన వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శానిటేషన్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం పొందిన ఓ వ్యక్తి ప్రస్తుతం టౌన్ ప్లానింగ్‌లో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. అతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రధాన నాయకులకు దగ్గర ఉంటూ వారి పేరుతోనే వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రభుత్వ ఆదాయానికి గండి...

సూర్యాపేట.. జిల్లా కేంద్రంగా మారిన తరువాత సూర్యాపేట మున్సిపాలిటీ భారీగా విస్తరిస్తోంది. మున్సిపాలిటీలో సుమారు 70వేలకు పైగా నిర్మాణాలున్నాయి. కాగా మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి. అయితే సూర్యాపేట మున్సిపాలిటీలో అరకొర అనుమతులు తీసుకొని కొందరు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా బహుల అంతస్థులు, సెలార్లు, అండర్‌గ్రౌండ్లు, పెంట్ హౌస్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. 

పట్టణంలో దాదాపు 100 వరకు అనుమతి లేని బహుళ అంతస్తులు, సుమారు 70 వరకు అనుమతి లేని సెల్లార్లు, దాదాపు 50 శాతానికి పైగా సెట్‌బ్యాక్ లేకుండా రోడ్డును ఆక్రమించిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇవే ప్లానింగ్ అధికారులకు కాసుల పంట పండిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను గుర్తించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పని చేయాల్సిన సదరు అధికారులు.. లంచాలతో తమ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

చక్రం తిప్పుతున్న ఆ ఉద్యోగి..

శానిటేషన్ విభాగం అవుట్‌సోర్సింగ్ ఉ ద్యోగులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను టౌన్ ప్లానింగ్ విభాగంలోకి తీసుకున్నారు. ఆ ఇద్ద రూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఒకరిని పక్కకు పెట్టారు. మిగిలిఉన్న మరో వ్యక్తి టౌన్ ప్లానిం గ్ విభాగంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. పట్టణంలో కొందరు అనుచరులను ఏర్పాటు చేసుకొని నిర్మాణాల వివరాలను సేకరించి ఎక్కడ నిర్మాణం జరుగుతుందో అక్కడ వాలిపోవడం అతని రోజువారి విధి గా మారింది. అనుమతుల పేరుతో యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వసూలు చేసిన మొ త్తంలో అధికారులకు వాటాలు ఉన్నట్లు ప్రచారం.

కాగా ఇతను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు దగ్గర వ్యక్తిగా కొనసాగి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరుతో సదరు ఉద్యోగి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా సూర్యాపేట పట్టణంలో అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు అం దుకున్న కొందరు మున్సిపల్ కమిషనర్‌ను కలువగా తనదేమి లేదని ఆ నాయకుడిని కలిస్తే సరిపోతుందని తెలుపుతున్నట్లు సమాచారం. అంటే సదరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చెప్తున్న మాటలను కమిషనర్ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు అర్థంమవుతోంది. ఈ వసూళ్లలో అధికారులతో పాటు, అధికార పార్టీ నాయకులకు వాట ఉందా..? లేదా? అనేది తెలియదు. 

వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు..

సూర్యాపేట పట్టణంలో రోడ్డు ఆక్రమణలు జరిగినా, రోడ్డు మధ్య వరకు ర్యాంపులు కట్టినా, ఇంకుడు గుంతలు నిర్మించకున్నా, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టినా, పార్కింగ్ వదిలిన సెల్లార్‌లో దుకాణాలు ఏర్పాటు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. జీ ప్లస్ వన్ అనుమతులు తీసుకొని రెండు, మూడు అంతస్తులు కట్టిన నిర్మాణాలు పట్టణంలో వందల సంఖ్యల్లో ఉన్నాయి.