18-11-2025 12:07:09 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,నవంబర్ 17(విజయ క్రాంతి):ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో జాతీయ నిర్మాణ రంగ అకాడమీలో జిల్లాకు చెందిన 23 మంది భవన నిర్మాణ కార్మికులు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, భవన నిర్మాణ కార్మికుల కొరత ఉందని తెలిపారు. జాతీయ నిర్మాణ రంగ అకాడమీలో శిక్షణ పొందడం ద్వారా ఇండ్ల నిర్మాణంలో నైపుణ్యంతో పనులను వేగవంతం చేయవచ్చని, మరింత ఉపాధి అవకాశాన్ని కల్పించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, గృహ నిర్మాణ శాఖ పి. డి. ప్రకాష్ రావు, అధికారులు, శిక్షణ పొంది న కార్మికులు పాల్గొన్నారు.