30 March, 2026 | 2:17 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

30-03-2026 12:46 AM
  1. మావోయిస్టు కమాండర్ ముచాకి కైలాష్ మృతి

తలపై రూ. 5 లక్షల రివార్డు, 303 రైఫిల్ స్వాధీనం

పౌరులను చంపడం, ఐఈడీ పేలుళ్లలో మాస్టర్ మైండ్

సుక్మా, మార్చి 29: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పోలంపల్లి పోలీస్ స్టేషన పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రూ. 5 లక్షల రివార్డు ఉన్న 31 సెక్షన్ కమాండర్ పీపీసీఎం ముచాకి కైలాష్ మృతి చెందాడని, భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి 303 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముచాకి సుక్మాలోని చింతల్నార్ పులన్ పాడ్ నివాసిగా గుర్తించారు.

ఇతనిపై పౌరులను హత్య చేయడం, ఐఈడీ పేలుళ్లకు కుట్ర వంటి అభియోగాలున్నాయి. పోలంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ లో భాగంగా దళాలతో వెంటనే కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోలు భద్రతా దళాలకు ఎదురుపడగా ఇరువురి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

కేంద్రం ప్రకటించిన గడువు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో మరింత మంది మావోయిస్టులు లొంగిపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మార్చి 30న లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై చర్చ జరగనుంది. శివసేన ఎంపీ శ్రీకాంత్‌షిండే చర్చను ప్రారంభించి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భద్రతాపరమైన చర్యలు, ఆయా ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకురానున్నారు.