1 May, 2026 | 2:17 AM

పాల్వంచలో ‘అక్రమ’ రాజ్యమేలుతోంది

01-05-2026 12:56 AM

అధికారుల కళ్లెదుటే భూకబ్జాలు

రోడ్లు, చెరువులు, స్మశానవాటికలను వదలని ఆక్రమణదారులు

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ‘హైడ్రా’ తరహా చర్యలు 

అవసరమని ప్రజల డిమాండ్...

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ సబ్ డివిజన్ కార్యాలయం పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా భారీ కట్టడాలు వెలుస్తున్నా.. అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల ‘మామూళ్ల’ మత్తు వల్లే ఈ అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందని స్థానికులు మండిపడుతున్నారు. పట్టణంలోనే కాదు మండల స్థాయిలోనూ అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. లక్ష్మీదేవి పల్లి మండలం సర్వేనెంబర్1లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణమే అందుకు నిదర్శనం.

సర్వే నంబర్ల పేరుతో భారీ దందా

ముఖ్యంగా పట్టణంలోని  817, 444 సర్వే నంబర్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. సర్వే నంబర్ 817 పరిధిలోని భూముల్లో కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి, అధికారుల అండదండలతో భారీ భవంతులను నిర్మిస్తున్నారు. కళ్లెదుటే అక్రమ కట్టడాలు కనిపిస్తున్నా మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చెరువులు, స్మశానవాటికలు సైతం కబ్జా

అక్రమార్కుల ఆగడాలు అంతటితో ఆగలేదు. పట్టణంలోని కీలకమైన జలవనరులైన *రాతి చెరువు, మేడి కుంట, చింతల చెరువు* వంటి ప్రభుత్వ శిఖం భూములను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. చివరకు నటరాజ్ సెంటర్ సమీపంలోని *స్మశాన వాటిక* స్థలాన్ని కూడా వదలకుండా కబ్జా చేసి నిర్మాణాలు జరుపుతుండటం గమనార్హం. రోడ్లను ఆక్రమించి ప్రహరీ గోడలు, షాపులు నిర్మిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు.

మేయర్, ఎమ్మెల్యే స్పందించాలి.. ‘హైడ్రా’ తరహా చర్యలు కావాలి!

పాల్వంచలో జరుగుతున్న ఈ దోపిడీపై *కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ *స్థానిక ఎమ్మెల్యే* ప్రత్యేక చొరవ తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న *‘హైడ్రా’ (HYౄRA)* తరహా వ్యవస్థ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోకి కూడా రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే కబ్జాదారుల ఆగడాలకు బ్రేక్ పడుతుందనీ, ప్రభుత్వ భూములకు రక్షణ లభిస్తుందని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

ఏసీబీ దాడులు జరిగినా మారని తీరు

పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీన ం చేసుకున్నారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్

పాల్వంచలో సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాల దందాపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలి.

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అనుమతులు లేని కట్టడాలను, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను, ప్రజా ఆస్తులను కాపాడాలని బాధ్యతాయుతమైన కార్పొరేటర్లు , పట్టణ ప్రజలు  డిమాండ్ చేస్తున్నారు.